ArticlesNews

విశ్వశాంతి స్వరూపుడు గౌతమబుద్ధుడు

85views

( మే 23 – బుద్ధ పూర్ణిమ )

మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత కాలాలకు సంబంధించిన కొత్త మార్గాన్ని చూపుతూ వచ్చారు. అటువంటి గొప్ప మహనీయులలో ఒకరు గౌతమ బుద్ధుడు. హైందవ పంచాంగం ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున లుంబిని వనంలో బుద్ధుని జననం జరిగింది. తండ్రి పేరు శుద్దోధనుడు, తల్లి పేరు మాయ. వారు ఆయనకు పెట్టిన పేరు సిద్దార్థుడు. ఈ సంవత్సరం మే 23న గౌతమ బుద్ధుడు జయంతిని జరుపుకుంటున్నాము. గౌతమ బుద్ధుడు బాధలు, భయాలు, యుద్ధాలు, రక్తపాతాలు లేని జగతి కోసం తపించాడు. రాజ్యకాంక్ష, మితిమీరిన కోరికలు, ఈర్ష్యాద్వేషాలే దుఖా:నికి కారణమని బోధించిన బుద్ధుడు జనం గురించి ఈ ప్రపంచంలో ఆలోచించిన తొలి తాత్త్వికుడు.

గౌతమ బుద్ధుడు గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త, బౌద్ధమత స్థాపకుడు. తన ఆలోచనలతో ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపించాడు. భారతీయ సంప్రదాయంలో క్రమంగా ఎదిగిన రుగ్మతలను సవాలు చేశారు. బుద్ధుడు ఈ ప్రపంచంలో ఏదీ సుస్థిరమైనది కాదని అన్నీ నాశనం అయ్యేవే అని, ప్రతి ప్రాణి అనగా ఉత్తమ, మధ్యమ, నీచ అనే భేదం లేకుండా అన్ని నశింపబడతాయని బోధించారు. ఆయన కొత్తగా ఏ మతాన్ని సృష్టించలేదు. బౌద్ధం అనేది హిందూ మతపు నవీనరూపం మాత్రమే.

బుద్ధుడు మనిషి గౌరవాన్ని పెంచడం కోసం కృషి చేశారు.వైరం ఎప్పుడూ మైత్రితోనే శాంతిస్తుందని ఇదే సనాతన ధర్మమని చాటారు. బుద్ధుడు ప్రబోధించిన సత్యాలు సర్వకాలికం, సార్వజనీనం అని స్వామి వివేకానంద చెప్పారు. హింసతో నిండిపోయిన నేటి ప్రపంచానికి బుద్ధుడి వచనాలు ఒక ఊరట.