News

రెండో విడత చందనం అరగదీత ప్రారంభం

93views

విశాఖపట్నం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీత ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 23న వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు తెల్లవారుజామున స్వామికి సమర్పించనున్న మూడు మణుగుల పచ్చిచందనం (120 కిలోలు) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టారు. ఉదయం 7 గంటలకు చందనం చెక్కలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ భాండాగారం వద్ద బేడామడంపంలో 20 మంది సిబ్బంది అరగదీతని శాస్త్రోక్తంగా ప్రాంభించారు. తొలిరోజు 40 కిలోల చందనాన్ని అరగదీశారు. ఈ చందనాన్ని అర్చకులు తూకంవేసి భద్రపరిచారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ఏఈవో ఆనంద్‌కుమార్‌ పర్యవేక్షించారు. కాగా ఏడాదిలో నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజు చందనం సమర్పణ జరుగుతుంది. ఈనెల 10న జరిగిన చందనోత్సవం రోజు తొలివిడత చందన సమర్పణ చేశారు. రెండో విడతగా ఈనెల 23న వైశాఖ పౌర్ణమి రోజు చందనాన్ని సమర్పించనున్నారు.