ArticlesNews

సంస్కరణ గోదావరి కందుకూరి వీరేశలింగం

374views

(ఏప్రిల్ 16 – కందుకూరి వీరేశలింగం జయంతి )

సామాజిక ఆచరణ కొందరికి ఆదర్శం, మరి కొందరికి అనివార్యం, ఇంకొందరికి అదే జీవిత పరమార్థం. మూడోకోవకు చెందిన మహనీయుడే కందుకూరి. సామాజిక అణచివేతకు సూత్రధారియైన తన సొంత కులంపైనే యుద్ధం ప్రకటించి తనువున్నంత వరకూ అణగారిన జనంవైపు నిలిచి బతుకును సార్థకం చేసుకున్న ధన్య జీవి.

1848 ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు వీరేశలింగం జన్మించాడు. వీరి పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం. ఇక్కడి నుండి రాజమండ్రికి వలసెళ్లడంతో ‘కందుకూరు’ ఇంటి పేరుగా మారింది. నాలుగేళ్ల వయస్సులో తండ్రి సుబ్బారాయుడు చనిపోయాడు. పెదనాన్న, నాయనమ్మల పెంపకంలో వీరేశలింగం పెరిగారు. ఐదేళ్లకు బడిలో చేరాడు. రామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం నేర్చుకున్నాడు. పన్నెండేళ్లకు రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చదువులో ముందుండేవాడు. 1861లో వీరేశలింగం పదమూడేండ్లకు ఎనిమిదేళ్ల బాపమ్మతో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత రాజ్యలక్ష్మీగా పేరు మార్చారు.

ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వీరేశలింగం… తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ.. మరో వైపు సంఘ సంస్కరణ భావాలను చెప్పేవాడు. తన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 1874లో ‘వివేక వర్ధని’ పత్రిక పెట్టాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, వ్యత్యాసాలను, దోపిడీని ఎండగట్టారు. దురాచారాలకు మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఆ పత్రికను సాహసోపేతంగా నడిపారు. వేశ్య వృత్తిపై స్పందించారు. పత్రికను ఆయుధంగా మార్చుకుని పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.

సామాజిక దురాచారాలపై, మూఢవిశ్వాసాలపై వీరేశలింగం పెద్ద యుద్ధమే చేశాడు. 1902లో స్త్రీ పార్థనా సమాజ మందిరం నిర్మాణం చేసారు. 1905లో హితకారిణీ సమాజం సంస్థను తన భార్య రాజ్యలక్ష్మీతో ఏర్పాటు చేసి తన ఆస్తిని ఆ సంస్థకు ఇచ్చాడు. 1908లో రాజ్యమండ్రిలో ఉన్నత పాఠశాలను స్థాపించారు. ఆ రోజుల్లో స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో స్త్రీలకు విద్యనందించాలని ప్రచారం చేసాడు. అట్టడుగువర్గాల పిల్లలకు సైతం విద్యనందించాలని చెప్పేవారు. అప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని ప్రకటించారు. వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలకు పుస్తకాలు, పలకా బలపాలు ఇచ్చి ఉచితంగా తానే పాఠాలు చెప్పారు. ”చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో” అని ఆయన చెప్పినా సూక్తి ఎందరినో ప్రభావితం చేసింది. కుల మతాల్లేవని, మనుషులంతా ఒక్కటేనని బోధించాడు. అందరిని ఒకే చోట కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. పురుషులకు సమానంగా స్త్రీలు ఎదగాలని కొరుకున్నారు. మహిళాభ్యుదయాన్ని కాంక్షించారు. ఆరాట పడ్డారు. ఆ దిశగా పని చేసారు.

బాల్య వివాహాలను విరేశలింగం పంతులుగారు వ్యతిరేకించారు. అలాగే వితంతువులకు పెళ్లి చేసేందుకు తానే ముందడుగు వేశారు. నాటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా 40 మంది వితంతువులకు పెళ్లిళ్లు చేయించాడు. స్త్రీల కొరకు ‘సతీహిత బోధిని’ పత్రికను నడిపారు. మూఢవిశ్వాసాలు, సనాతనాచారాలపై పోరాటం చేసారు వీరేశలింగం. అందుకోసం 1887లో సంఘ సంస్కరణ సమాజం స్థాపించారు. 1893లో ‘రావు బహదూర్‌’ బిరుదును వీరేశలింగం అందుకున్నారు. వీరేశలింగంకు ఆయన భార్య నుండి పూర్తి సహకారాలందేవి. భర్త అడుగుజాడల్లో నడిచిన రాజ్యలక్ష్మీ 1910లో మరణించారు. వీరేశలింగం విజయాల వెనుక ప్రత్యక్ష, పరోక్ష పాత్ర రాజ్యలక్ష్మీగారిదే. వారి ఆశయాల సాధనకు ఆమె అండ కొండంత బలాన్ని చేకూర్చేది.

సంఘ సంస్కరణలతో పాటు, సాహిత్య రంగాల్లో వీరేశలింగం ఎనలేని కృషి చేశారు. ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ప్రముఖమైనవి. స్త్రీ విద్యాభివృద్ధి, స్త్రీ అభ్యుదయాన్ని సత్యవతీ చరిత్రము, చంద్రమతీ చరిత్ర గ్రంథాలు ఆవిష్కరించాయి. 130 వరకు గ్రంథాలు రాసాడు. తొలిసారి సమగ్రంగా ఆంధ్రకవుల చరిత్రను తీసుకువచ్చారు. మొట్ట మొదట స్వీయ చరిత్ర రాసుకున్నది ఆయనే. చమత్కార రత్నావళి, ”కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌” అనే షేక్స్‌పియర్‌ నాటకాన్ని తెలుగులో రాసి విద్యార్ధులచే ప్రదర్శింపజేసారు. కాళిదాసు శాకుంతలం, దక్షిణ గోగ్రహణం, సత్య హరిశ్చంద్ర, మాళవికాగ్ని మిత్రము వంటి నాటకాలు రాసారు. హస్య సంజీవని, సతీహితబోధిని, సత్య సంవర్థని, చింతామణి, సత్యవాదిని తదితర పత్రికలను నడిపారు.

తెలుగు సమాజంపై వీరేశలింగం ప్రభావం ఎంతో ఉంది. తెలుగు సమాజం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, శక్తి ఆయన. అందుకే ”కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు, వీరేశలింగ మొకడు మిగిలెను చాలు” అని ఆరుద్ర అన్నారు. నవీన సమాజానికి నాంది పలికి, నవయుగ వైతాళికుడిగా నిలిచిన వీరేశలింగం 1919 మే 27న మద్రాసులో తుది శ్వాస విడిచారు. రాజమండ్రిలోని ఆయన భార్య రాజ్యలక్ష్మీ సమాధి పక్కన వీరేశలింగం అస్థికలను పాతిపెట్టి అక్కడే స్మారక భవనం నిర్మించారు.