
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈనెల 16న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పసుపు, కుంకుమ, కస్తూరి పసుపు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉదయం సుప్రభాతసేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేశారు. గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపం, బలిపీఠం, ధ్వజస్తంభం, భక్త సంజీవరాయస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని గోడలపై చల్లారు. అనంతరం మూలవరులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు.
ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు వేర్వేరుగా శుక్రవారం సందర్శించారు. ఆలయ మర్యాదలతో ఈవో, కలెక్టర్, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.





