ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 59 ; కె.ఎన్.కేసరి

291views

నేడు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుగా చెపుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను స్వాతంత్ర పోరాటంలో భాగంగా చెయ్యటం ఆంధ్రులకే చెల్లింది. విదేశీవస్తు బహిష్కరణ పిలుపుకు భిన్నంగా స్పందించిన వారు, ప్రత్యామ్నాయ తయారీ గురించి ఆలోచించి అమలుచేసిన వీరులున్నారు. ఇది స్వాతంత్ర పోరాటంలో భాగమే. వారు కూడా స్వాతంత్ర సమరయోధులే. కోస్తా ప్రాంతంలో స్వదేశీ పరిశ్రమ నెలకొల్పి ‘మేడ్ ఇన్ ఇంగ్లాండ్’ వస్తువులు వద్దు, ‘మేడ్ ఇన్ ఇండియా’ అనేవే కొనండి అంటూ పిలుపునిచ్చిన వారు. వారు స్థాపించి, ప్రజలలోకి తీసుకువెళ్ళిన పరిశ్రమల గురించి తెలుసుకోవటం ఎంతైనా ప్రయోజనకరం.అటువంటి వారిలో ఒకరు కోట నరకేసరి(కె.ఎన్.కేసరి)

కె.ఎన్.కేసరి ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మద్దిపాడు మండలానికి చెందిన ఇనమనమెళ్ళూరు అనే కుగ్రామం, గుండ్లకమ్మ వాగుతీరం. నిరుపేద కుటుంబంలో ఓ పూరి ఇంట్లో జన్మించానని వారే చెప్పుకున్నారు. కాలమహిమ ఎవ్వరూ కానలేరు. ఎప్పుడు ఏవిధంగా విధి జీవులను మారుస్తుందో తెలియదు. “నరకేసరి” పుట్టిన ఐదు నెలలకే తండ్రి కలరాతో చనిపోయాడు. దిక్కుతోచని కుటుంబం. జంధ్యాలు ఒడికి సంపాదించిన రొక్కం పది రూపాయలు మాత్రం మిగిల్చి వెళ్ళారు తండ్రి. తల్లి కటిక దరిద్రంలో బాలుని పెంచింది. క్షణక్షణం కష్టాలు అనుభవించింది ఆ తల్లి. ఆమె కష్టం చూడలేక ‘నరకేసరి’ బతుకుబాట వెతుక్కుంటూ చెన్నపట్నం నడిచివెళ్ళాడు.

ఎక్కడ గ్రామమయిన ఇనమనమెళ్ళూరు, ఎక్కడ చెన్నపట్నం. పన్నెండేండ్ల కాలుడు. జేబులో పైసాలేదు. ఎలాబతకాలో తెలియదు. గుండెలనిండా ధైర్యముంది. స్వంతవూరు నుండి మూడువందల ముప్పది కిలోమీటర్ల దూరం, కాలినడక, ఒంటరి ప్రయాణం, నా అనేవారు లేని మద్రాసు చేరి, తరువాతి కాలంలో నగరంలోనే ప్రముఖ వ్యక్తిగా, దానశీలిగా, మహిళా ఆరోగ్య ప్రదాతగా ఎదిగారు. కోటనరకేసరి. ఇయనే కేసరి కుటీరం వ్యవస్థాపకుడు. ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్కు అన్నట్లు, పిల్లవానికి చెన్నపట్నంలో రావిచెట్టు అగ్రహారం నివాస ప్రాంతమైంది. ఎలాగోలా ఆహారం సంపాదించి, రాత్రికి రావిచెట్టు క్రింద పడుకుండేవాడు నరకేసరి. అక్కడ బ్రాహ్మణ సత్రాలలో ఒక్కపూట మధ్యాహ్నం భోజనం దొరికేది. రాత్రికి మంచినీళ్ళే ఆహారం.

చదువుకుంటే ఏమన్నా ఉద్యోగం సంపాదించుకోవచ్చునని జార్జిటవున్, బందరు వీధిలో వీధిబడి చెప్పే రామానుజాచారి గారి మెప్పు సంపాదించి, యింట్లో ఉండి గురుశుశ్రూష చేసేటట్లు, ఒప్పించుకుని వారి వద్ద ప్రాచీన సాహిత్యం కొంత అభ్యసించాడు. కాని అది బ్రతుకుతెరువుకు పనికిరాదని కొంత ఆంగ్ల విద్య అవసరమని గ్రహించి, హిందూ థియోలాజికల్ స్కూల్లో ఉచితంగా చదువుకునే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఆ పాఠశాల శివశంకరపాండ్యా అనే దేశభక్తుడు స్థాపించారు. క్లాసులో పేరు పిలిచేటప్పుడు, హాజరులో ‘నరసింహం’ అని పేరు పిలిచినప్పుడు ఇద్దరు పలికేవారు. ఇద్దరి పేర్లు చిక్కుగా ఉన్నదని బాలుని పేరు అర్ధం చెడకుండా కొద్దిగా మార్పుచేసి “కోట నరకేసరి”గా దరిమిలా కె. ఎన్. కేసరిగా వ్యవహరింపబడుతూ వచ్చారు. పాండ్యా వద్ద చదువు ఉచితం, అయినా భోజనం, దుస్తులకు, పుస్తకాలకు ఇబ్బందిపడి, భోజనానికి వారాలు ఏర్పాటు చేసుకుని, పుస్తకములకు స్థానిక వ్యాపారుల వద్ద నెలవారి చందాలు ఏర్పాటు చేసుకున్నారు.

అది అయ్యాక కొంతకాలం ఒక వకీలు వద్ద రెండు నెలలు పనిచేసినా జీతం ఇవ్వకపోవడంతో ఆయన వద్ద మానుకుని, కొద్ది చదువుతో వచ్చే పని చూసుకుందామని ఒక నంబి ఆచార్ల వద్ద, మహదేవశాస్త్రి గారనే మరొక ఆయుర్వేద వైద్యుని వద్ద కొంత పరిజ్ఞానంతోపాటు జీవితానికి అవసరమైన డబ్బు సంపాదించుకుని కల్పంలో లేహ్యాలు మందులు తయారుచేయటం నేర్చుకున్నారు.ప్రఖ్యాత పండితులు డి.గోపాలచార్యులు వారు ప్రధానవైద్యులుగా చెన్నపట్నంలో ప్రసిద్ధులు. వారివద్ద నాలుగు సంవత్సరములు కేసరికి అవకాశం కలిగి, ఆయనవద్ద ఉద్యోగానికి కుదురుకున్నారు. కాసింత వ్యవహారం, మరికాస్త వైద్యంలో మెళుకువలు తెలుసుకుని చెన్నపట్నం నారాయణ మొదటివీధిలో ఒక చిన్న ఇల్లు ఒక రూపాయి ఆరు అణాలకు బాడుగకు తీసుకుని కేసరి కుటీరం ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించారు. అది ఆయన దిన జీవనగతినే మార్చివేసింది. కాలమహిమ అది, అప్పటికి ఆయన వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు.

మద్రాసు, యిప్పటి చెన్నైలో తెలుగు ప్రముఖులు ఎ.సి. పార్ధసారధినాయుడు గారు, “ఆంధ్రప్రకాశిక” పేరుపైన తెలుగు పత్రిక నడిపేవారు. నాయుడు గారితో కలిసి ఆయుర్వేద మందుల ప్రకటనలను, చిత్రంగా, సంభాషణల పూర్వకంగా ప్రకటించేవారు. కేసరి కుటీరం అందించే ఆయుర్వేద మందులు, తాంబూలంలో వేసుకునే పరిమళ మాత్రలు అక్కడ దొరుకుతవి అని, అవి సేవించిన వారికి దాంపత్యం అద్భుతంగా సాగుతుందని ప్రకటన వేసేవారు. దానితో కేసరి గారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అయింది. అమ్మకాలు విపరీతమై రోజుకు వంద రూపాయల వంతున జరిగేవి. అప్పటి వంద రూపాయలు ఇప్పటి లక్ష రూపాయలకు సమానమేమో!

వ్యాపారం వృద్ధి అయ్యాక సికిందరాబాద్లో కేసరి కుటీరం శాఖ ప్రారంభించారు. మద్రాసులో అడియప్ప నాయకన్ వీధిలో పెద్ద ఇంట్లోకి వైద్యశాలను మార్పించారు. పిదప ఎగ్మూరులో రెండు ఇండ్లు నిర్మించారు. నివాసమున కొకటి, ఆఫీసు కొకటి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందాక మేనమామ దగ్గరకు తీసుకోగా, మేనమామ కూతురితో వివాహం జరిగింది. వారి సమీప గ్రామం అయిన చదలవాడ గ్రామంలోని రామాలయంలో వివాహం జరిగింది. ఇప్పటికి చదలవాడలో శ్రీరామనవమికి రథోత్సవం అద్భుతంగా జరుగుతుంది. తలంబ్రాల సమయంలో గరుడుడు ఆకాశంలో తిరుగుతాడు. అప్పుడే తలంబ్రాలు జరుగుతాయి. అటువంటి అద్భుతమైంది రామాలయం. ఆయన భార్య గురించి కేసరిగారు ఇలా రాసుకున్నారు. నా గృహలక్ష్మి శుద్ద అమాయకురాలు, పాతకాలపు భాగ్యశాలి, పరమ భయస్తురాలు ఆ భయానికి మెడ నిండా తాయత్తులు వేసుకుండేది. వివాహనంతరం మద్రాసులో కాపురం. మద్రాసు వచ్చాక ఆమె పేరు కనకమ్మగా మారింది.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో చాలా మంది, జపాన్ వారు బాంబులు వేస్తారనే భయంతో మద్రాసు వీడి స్వస్థలాలకు బయలుదేరారు. ఆ క్రమంలో చెన్నపట్నం ఒంగోలులో బంధువుల ఇంట్లో ఉండగా 1921 సం॥లో కనకమ్మ కాలగతి చెందారు.ఆమెకు పిల్లలులేరు. మొదటి భార్య మరణించాక, కేరళ నాయర్ వనిత త్రిస్సూరుకు చెందిన ‘మాధవి’ని వివాహమాడారు. అప్పటిలో ఆయన వయస్సు 43 సం॥లు, మాధవి వయస్సు వయస్సు 28 ఏండ్లు. ఆమె విద్యావంతురాలు. ఆయుర్వేద వైద్యంలో పరిజ్ఞానం ఉన్న మహిళ. త్రిస్సూర్ కేసరి కుటీరంలో మందుల తయారీలో ముఖ్యపాత్ర పోషించి, భర్త అడుగుజాడలలో నడిచి కేసరి గారికి చేదోడు వాదోడుగా వున్నారు మాధవి’ గారు. వీరికి శారద, వసంతకుమారి యిద్దరు కుమార్తెలు. ఆయుర్వేద పూర్వకంగా ఔషధాల తయారి అమ్మకాలలో ధనార్జనతో విపరీతంగా లాభాలు గడించారు. వేషభాషలు అన్నీ జమిందారీ ఫక్కిలో వుండేవి. బెంగుళూరు బసవన్న గుడి ప్రాంతం తోట బంగళా, మద్రాసులో మరో కేసరి కుటీరం, “లోధ్ర” టానిక్కు ప్రకటనలు, బెంగుళూరులో “లోధ్ర లాడ్జ్” ఆరోజుల్లో ప్రముఖమైంది. లాల్ బాగ్ లో ప్రతి సంవత్సరం జరిగే పుష్ప ప్రదర్శనలల్లో వరుసగా ఎనిమిది సంవత్సరములు బహుమతులు గెలుచుకున్నారు.

గాంధీజీ ప్రభావంతో స్వాతంత్ర్య సమరంలో 1941 సంవత్సరంలో యివన్నీ మానుకుని జమిందారీ విధానానికి స్వస్తి చెప్పారు. స్త్రీ జనోద్దరణలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి ప్రభావంతో ‘గృహలక్ష్మి’ పత్రిక స్థాపించారు. పేదరికంలో చదువుకోవడానికి ఇబ్బంది పడిన సంఘటనలు జ్ఞాపకముంచుకుని, చదువులరాణి పేరిట బెంగుళూరు బంగళా విక్రయించిన ధనంతో “కేసరి విద్యాలయం” కట్టించారు. మైలాపూర్లో కేసరి ప్రాథమిక పాఠశాల తెలుగు పిల్లల విద్యాభ్యాసానికి డేబ్బదివేలు. విరాళమందించారు. 1943లో చక్కటి వాస్తుశైలితో విశాలమైన భవనసముదాయం రూపుదిద్దుకుంది. మిడిల్ స్కూల్ నుండి హయర్ సెకండరీ పాఠశాలగా అభివృద్ది చెందింది. మద్రాసులో తెలుగువారు అధికంగా నివశించే త్యాగరాయనగర్ (టి.నగర్) ప్రాంతంలో తెలుగువారి కోసం పాఠశాలకు భారీ సహాయం అందించారు. స్త్రీల విద్యాభివృద్ధికి “కేసరి కన్యా విద్యాలయం” అన్న పేరుతో ఆడబిడ్డలకు ఒక విద్యాలయం నెలకొల్పండి అంటూ నినాదమిచ్చి లక్షల విరాళాలు సొంతంగా ఇచ్చారు. అలా కేసరి కన్యా విద్యాలయం మద్రాసులో దినదినాభివృద్ధి అయ్యింది. గృహలక్ష్మి పత్రిక స్థాపించిన నాటి నుండి ఆ పత్రికకు ఆయనే సంపాదకులు. మద్రాసులోని పూనమల్లి హైరోడ్డులో పెద్దభవనం అద్దెకు తీసుకుని మందులతయారీ ఫ్యాక్టరీ, కేసరీ కుటీరం “లోధ్ర” ఆఫీసు పేర ముద్రణాలయం మొదలుపెట్టారు. 1928 మార్చి నుండి గృహలక్ష్మి పత్రిక వెలువడింది.

గృహలక్ష్మి పత్రిక తరపున వివిధ రంగాల విశిష్ట మహిళలను సన్మానించాలని “చదువుకొనునపుడు తనను ఆదరించి అన్నము పెట్టిన అమ్మల అమృత హస్తాలకు ఏటేటా గృహలక్ష్మి స్వర్ణ కంకణము అనే పేరుపై బంగారు కంకణాలు తొడిగారు. సుమారు 45 మంది ప్రముఖ స్త్రీమూర్తులకు 1934 నుండి అవార్డులు అందించారు. ఆయుర్వేద వైద్యునిగా, స్త్రీ జనోద్ధారకుడిగా, సంగీతాభిలాషిగా, అవిరళ దాతగా ఒంగోలు ముద్దుబిడ్డ, మద్రాసు నగర చరిత్రలో, ఆంధ్రుల చరిత్రలలో ప్రముఖులుగా నిలచారు. తన 79వ ఏట 1953 జూన్ ఎనిమిదవ తేదీన పరమపదించారు. ఆయన స్మారకం యిప్పటికీ మద్రాసు మహానగరంలో తెలుగు బావుటా ఎగురవేస్తూ, కేసరి కుటీరం, నేటికి నడుస్తూ సేవలందిస్తున్నాయి, నరకేసరికి నివాళులు అర్పిస్తూనే ఉన్నాయి.