
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులుచేర్పులు చేశారు. అయోధ్యలో బాబ్రీ కట్టడం కూల్చివేత, గుజరాత్ అల్లర్లు, హిందూత్వ అంశాల్లో సవరణలు చేశారు. ఇది సాధారణంగా పుస్తకాల నవీకరణలో భాగంగా జరిగే ప్రక్రియేనని అధికారులు పేర్కొన్నారు. ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన పాఠ్యాంశాల ముసాయిదా కమిటీ సిద్ధం చేసిన మార్పులను ఓ డాక్యుమెంట్‌లో వివరించారు. దాని ప్రకారం.. రామజన్మభూమి ఉద్యమాన్ని ‘రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల ప్రకారం’ అని మార్చారు. గతంలో 11వ తరగతి పాఠ్యపుస్తకంలో చాప్టర్ 8లో సెక్యులరిజం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘2002లో గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల అనంతరం 1000 మందికి పైగా, ముఖ్యంగా ముస్లింలను ఊచకోత కోశారు’’ అని ఉండేది. ప్రస్తుతం దాన్ని ‘‘2002లో గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల అనంతరం 1000 మందికిపైగా చనిపోయారు’’ అని మార్చారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధానికి సంబంధించిన అంశాలను తొలగించారు. ‘గాంధీజీ మరణం దేశంలోని మతపరమైన పరిస్థితులపై మ్యాజికల్ ప్రభావం చూపింది’, ‘హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ చేసిన ప్రయత్నాలు హిందూ తీవ్రవాదులను రెచ్చగొట్టింది’ ‘ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థలను కొంతకాలం పాటు నిషేధించారు’ వంటి వాఖ్యాలు కొత్తగా ముద్రించిన పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు.
అలాగే కశ్మీర్ అంశంపైనా, మొఘల్స్ పాలన, ఎమర్జెన్సీ, కోల్డ్‌వార్, నక్సలైట్ ఉద్యమం, కోర్టులకు సంబంధించిన పాఠ్యాంశాల్లోని కొన్ని భాగాలను మార్పులు చేసినట్లు వెల్లడించారు.





