News

వైభవంగా మెట్లోత్సవం

219views

తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద గురువారం వైభవంగా మెట్లోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడుతూ ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టును అధిరోహిస్తూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని వెల్లడించారు.

పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామి వారి కృపకు పాత్రలయ్యారని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి విచ్చేసిన సుమారు 2వేల మందికిపైగా భజన మండళ్ల సభ్యులు, ప్రముఖ సంగీత కళాకారులు భజనల చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామి వారిని దర్శించుకుంటారని వివరించారు. ఈ క్రమంలో శుక్రవా రం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచర్య వంశీయులు ముందుగా మెట్ల పూజ నిర్వహించారు. అనంతరంర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం చేపట్టారు. కార్యక్రమంలో శ్రీగోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీ ఈఓ శాంతి, అన్నమాచార్య వంశీయులు తాళ్లపాక హరినారాయణాచార్యులు పాల్గొన్నారు.