
శ్రీ వేముల కూర్మయ్య 10 సెప్టెంబరు 1903 వ సం||లో కృష్ణాజిల్లా మల్లవరం గ్రామంలో జన్మించారు. తల్లి అచ్చమ్మ, తండ్రి వెంగళయ్య. గుంటూరుజిల్లా వడ్లమాను గ్రామస్తుడైన శ్రీ వెంగళయ్య పంచముల పురోహితునిగా (మాల దాసరి)ఆయుర్వేద వైద్యునిగా చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రసిద్ధులు. వైష్ణవ మత ప్రచారం ఆయన వృత్తి. వెంగళయ్యగారి పురాణ కథలను, వేదాంతాన్ని, వారి ఆధ్యాత్మిక ప్రచారాన్ని వినడానికీ పంచములేకాదు, అన్ని కులాలవారూ వస్తూండేవారు.అందరికి గౌరవపాత్రుడాయన.
ఒకసారి వడ్లమాను గ్రామం చుట్టు ప్రక్కల పెద్ద కఱవు వచ్చింది. కొందరు ప్రజలు ఇతర గ్రామాలకు వలసవెళ్ళారు. “క్రైస్తవం పుచ్చుకుంటే తిండి పెట్టి మంచి నీళ్ళు ఇస్తామని” క్రైస్తవ మిషనరీలు ఎరచూపారు. ఒకరిద్దరు క్రైస్తవంలోకి వెళ్ళారు. వెంగళయ్యగారి ప్రభావం కారణంగా వడ్లమాను పంచాయతీలోని పంచములెవ్వరూ క్రైస్తవంలోకి వెళ్ళలేదు.
ఆంధ్రపత్రిక సంస్థాపకులైన శ్రీకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు తమ స్వంత గ్రామం యలకుర్రు (కష్టాజిల్లా నిడుమోలు వద్ద ఉంది) లో శ్యామలాదేవి వరణ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు. తండ్రి మరణానంతరం 1916వ సం॥లో కూర్మయ్య, శ్రీ నాగేశ్వరావు పంతులుగారి సహకారంతో ఆ పాఠశాలలో చేరారు. పంచములను పాఠశాలలో చేర్చుకోవడం సాహసమే ఆరోజుల్లో ! తర్వాత కాలంలో మచిలీపట్నంలో వేమూరి రాంజీరావు పంతులు నిర్వహించిన హస్టల్లో ఉండి చదువుకున్నారు కూర్మయ్య. రెండు సంవత్సరాలు సబర్మతి ఆశ్రమంలో ఉండి సేవలు కొన్ని చేశారు. అక్కడే గాంధీజీనుండి ప్రేరణ పొందారు.
శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, రాంజీరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావుల సహకారంతో MA, LLB చదవడం కోసం కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. శ్రీ మదనమోహన మాలవ్యా ఫీజు లేకుండా చేర్చుకొని, స్ట్రెఫండ్ వచ్చేట్లు ఏర్పాటు చేశారు. హిందువుల పుణ్యక్షేత్రమయిన కాశీనగరంలో హిందూ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి హరిజన విద్యార్థిని చేర్పించిన ఘనత ఆంధ్ర ప్రాంతానికి చెందింది. ఆ మొదటి విద్యార్థి శ్రీ కూర్మయ్యే. ఒక సంవత్సరం తర్వాత అదే విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా బాబూజగజ్జీవనరాం చేరారు.
న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉంటూనే, 1929 విజయవాడ 7వ ‘ఆది ఆంధ్రమహాసభ’ ఆహ్వాన సంఘ అధ్యక్షులయ్యారు. ఆ మహాసభల నిర్ణయం మేరకు హరిజనుల అభివృద్ధికి విద్య చాలా అవసరమనీ, వారిని విద్యావంతులను చేయడానికి ముఖ్యంగా బాలికలకోసం ‘వసతిగృహన్ని’ ప్రారంభించాలనీ నిర్ణయమైంది. శ్రీకాళేశ్వరరావు గారు అధ్యక్షులుగా, కూర్మయ్య గారు కార్యదర్శిగా శ్రీరాముని దూత అయిన ఆంజనేయుని తల్లి అంజనాదేవి పేరున ‘అంజనాదేవి ఆది ఆంధ్ర బాలికల వసతిగృహం’ ప్రారంభమైంది. దీని నిర్వహణ బాధ్యత కూర్మయ్య గారి మీద పడింది. న్యాయవాద విద్య పూర్తయినా, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరకుండా ప్రజలకు సేవ చేయాలనీ, ప్రత్యేకంగా హరిజన వర్గాల సముద్ధరణకు తాను కృషి చేయాలనీ నిర్ణయించుకున్నారు కూర్మయ్యగారు.
1932లో కూర్మయ్యగార్కి శ్యామలాదేవితో వివాహమైంది. ఆనాటినుండి శ్యామలాదేవి బీద, దళిత ప్రజల సేవలో, హాస్టలు నిర్వహణలో నిమగ్నమైంది. వేలాది విద్యార్థులకు ఉచిత విద్యాదానం, అన్నదానం చేసిన మహనీయురాలామె. ఈ వసతిగృహంలో కేవలం ఆంధ్రప్రాంతం నుండే కాక, దక్షిణాదిరాష్ట్రాలనుండి, చివరకు బర్మానుండి కూడా అనేకమంది బాలికలు వచ్చి చేరి విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. కాలక్రమంలో ఈ బాలికల వసతిగృహంలో సుమారు 450 మంది బాలికలు ఉంటూ నగరంలోని వివిధ పాఠశాలల్లో చదువుకునేవారు. వీరందరికీ ఒక పాఠశాల అవసరమని గుర్తించి శ్రీ కూర్మయ్యగారు తన తల్లి పేరున కీ॥శే॥ వేముల అచ్చమ్మ గారి జ్ఞాపకార్థం ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. కొన్ని వేలమంది బీద బాలబాలికలు ఈ పాఠశాలలో చదువుకున్నారు. వీరిలో కొంతమంది ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
గాంధీజీ పిలుపుమేరకు 1932 అక్టోబరు 16న ఆంధ్రరాష్ట్ర హరిజనోద్ధరణ సంఘం ఏర్పడింది. కూర్మయ్యగారు దానికి సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలను, స్వీకరించారు. 1933 నవంబరు 2న సుబ్రహ్మణ్యషష్ఠి పండుగ సందర్భంగా కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలోకి హరిజన ప్రవేశ చేయించారు కూర్మయ్యగారు. దీనికై ఒక సం|| పాటు ఆ గ్రామప్రజల సహకారానికై ప్రయత్నించారు. చివరకు గొట్టిపాటి బ్రహ్మయ్యగారి సహకారంతో హరిజనుల దేవాలయ ప్రవేశంపై గ్రామంలోని 85% మంది ప్రజానీకం చేత సంతకాలు చేయించి, దేవాలయ ప్రవేశాన్ని చేయించారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ దేవాలయ ప్రవేశ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కూర్మయ్యగారు.
తూర్పు కృష్ణాజిల్లాలోని బందరు దీవి, గుడివాడ, కైకలూరు తాలూకాలు కలసి ఒక సంయుక్త నియోజక వర్గం. ఈ నియోజక వర్గం నుండి రిజర్వుడు అభ్యర్థిగా 1937లో ఉమ్మడి మద్రాసు అసెంబ్లీకి శ్రీ కూర్మయ్యగారు MLAగా ఎన్నికైనారు. 1940 అక్టోబరులో, గాంధీజీ ఇచ్చిన పిలుపుమేరకు శ్రీ కూర్మయ్య వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి, రాయవేలూరు జైలులో ఉన్నారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, శ్రీ ప్రకాశం పంతులు మంత్రి వర్గంలో శ్రీకూర్మయ్య రేడియో, సమాచారశాఖ, హరిజన మంత్రిత్వ శాఖామంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. 1991 దక్షిణాది రాష్ట్రాలలో మొట్టమొదటి హరిజనమంత్రి శ్రీకూర్మయ్య గారే. ప్రత్యేకంగా హరిజన మంత్రిత్వశాఖను ఏర్పరస్తూ, హరిజనులు, గిరిజనులు, వెనుకబడినవర్గాల టూరు. ప్రజలలో విద్యాభివృద్ధి కొరకు 800 విద్యార్థివసతి గృహలను, 1946లో మొదటి సంవత్సరంలోనే ప్రారంభింపచేసి, ప్రభుత్వ నిధులు వాటికి అందేట్లు చూశారు. శ్రీ కూర్మయ్య గారి చొరవవల్లే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో “మద్రాసు రిమూవల్ ఆఫ్ సివిల్ డిజెబిలిటిస్ (ఎమెండ్మెంట్) బిల్ 1947” బిల్లు ఆమోదింపబడింది.
1955 అసెంబ్లీ ఎన్నికల్లో కూర్మయ్యగారు తిరిగి MLAగా ఎన్నికైనారు.’వ్యవసాయకూలీ కాంగ్రెసు’ కు శ్రీకూర్మయ్య సంస్థాపక అధ్యక్షులు. ‘వ్యవసాయకూలీ పత్రిక’ను వారు నడిపారు. శ్రీకూర్మయ్య క్రియావాది. ఆచరణదక్షుడు. కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాక అనేక పనులకు వాస్తవరూపం కల్గించిన ప్రజ్ఞావంతుడు. ప్రతిభావంతుడు. కూర్మయ్యగారు ఉన్నతమైన ఆలోచనలతో మార్గదర్శకంగా ఉండి తానేకాక తన వారందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి తోడ్పడ్డారు. ఇతర కులాలను దూషించకుండా తన దారిన తాను నిర్మాణాత్మకంగా హరిజనాభివృద్ధి కోసం కృషిచేశారు. అందుకే నిజమైన అభ్యుదయవాది శ్రీ వేముల కూర్మయ్య.





