
భారత సైన్యం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తోంది. శనివారం దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ మున్నా లాహోరిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అతడితో పాటు మరో స్థానిక ఉగ్రవాది కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. షోపియాన్‌లోని బన్ బజార్ ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాలకు సమాచారం రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతాసిబ్బందిపైకి కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
అయితే.. నిన్న రాత్రి నుండి జరిగిన ఈ ఆపరేషన్‌లో భద్రతాసిబ్బంది ఈరోజు ఉదయం ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకడు మున్నా లాహోరీగా గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన 19ఏళ్ల మున్నా జైషే సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను ఆకర్షించి ఉగ్రవాదంలో చేర్చడంలో ఇతడు దిట్ట. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై పుల్వామాలో దాడి జరిగిన ప్రదేశానికి 27 కిలోమీటర్ల దూరంలో గత నెల 17 తేదీన 44రాష్ట్రీయ రైఫిల్స్‌పై ఐఈడీతో దాడి జరిగింది. ఈ దాడిలో తొమ్మది మంది జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడి వెనుక జైషే ఐఈడీ నిపుణులు లాహోరీ హస్తం ఉందని భద్రతా దళాలు గుర్తించాయి.
Source : Bharath Today.





