ArticlesNews

పుల్లరిపై పల్నాటి బహిష్కరణ బాణం కన్నెగంటి హనుమంతు

451views

( ఫిబ్రవరి 26 – కన్నెగంటి హనుమంతు )

నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? ఎందుకు కట్టాలిరా శిస్తు!.. అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తిని నింపింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సాధారణ రైతు జీవితం గడుపుతున్న ఆ శక్తి బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ స్ఫూర్తి, ఆ శక్తే.. పల్నాడు పుల్లరి ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన కన్నెగంటి హనుమంతు! వీరు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి సమీపంలోని కోలేకుట్ట శివారు ప్రాంతమైన మించాలపాడు వెంకటయ్య, అచ్చమాంబలకు 1870 జూన్‌లో జన్మించారు. వీరిది వ్యవసాయకుటుంబం.

గాంధీజీ పిలుపుతో దేశమంతా సహాయ నిరాకరణోద్యమంలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలోనే పల్నాడులో పుల్లరి సత్యాగ్రహం ఊపందుకుంది. పుల్లరి అంటే పచ్చిక మైదానాలపై విధించే పన్ను. అడవుల్లో కట్టెలు కొట్టాలన్నా, మైదానాల్లో పశువుల్ని మేపాలన్నా శిస్తు కట్టాల్సిందేనన్న బ్రిటిష్‌ ఆజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహ స్ఫూర్తి పల్నాడు మొత్తం వ్యాపించింది. ఈ ఉద్యమ కాలంలో హనుమంతును పలుమార్లు బ్రిటిష్‌ పాలకులు అరెస్టు చేశారు. సత్యాగ్రహ కొనసాగింపుగా నల్లమల ప్రాంత చెంచులతో కలిసి హనుమంతు పోరుబాట పట్టారు. 1921–22 కాలంలో హనుమంతు పేరు వింటే పల్నాడులో బ్రిటిష్‌ అధికారులకు ముచ్చెమటలు పట్టేవంటే అతిశయోక్తి కాదు. ‘‘కన్నెగంటి హనుమంతు కోర మీసము దువ్వి.. పలనాటి ప్రజలచే పన్నులెగ గొట్టించె,’’ అని కవులు ఆయన పోరాటాన్ని గానం చేశారు. మిణుగురులు లేచె బెడదవు శౌర్యాగ్నిశిఖలు మాంచాలపురిన్‌ హనుమంతుడన వీరుడు.. తెల్ల దొరల నేదిరించెన్‌… అని గుర్రం జాషువా కన్నెగంటి హనుమంతు పోరాటాన్ని ప్రశంసించారు.

దావానలంలాగా రేగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నింది. తొలుత హనుమంతుకు లంచమిచ్చి తమవైపు తిప్పుకోవాలని నాటి బ్రిటిష్‌ అధికారి రూథర్‌ఫర్డ్‌ కుయుక్తి పన్నాడు. దుర్గి ఫిర్కాకు కన్నెగంటిని జమిందార్‌ గా చేస్తామన్నారు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడిని కాననీ, తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తిననని తెగేసి చెప్పాడు. దీంతో ఇక దండోపాయమే శరణ్యమని భావించిన రూథర్‌ఫర్డ్‌ ఆమేరకు గుంటూరు కలెక్టర్‌ వార్నర్‌కు ఆదేశాలిచ్చాడు. 1922 శివరాత్రి రోజున కొందరు అటవీ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఆప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకొని వున్నారు కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. పోరాటాన్ని తర్వాత వేరే రూపాల్లో కొనసాగించాలని ఆయన భావించారు.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మించాలపాడుతో సహా చుట్టు పక్కల గ్రామాలలోని యువకులు, కన్నెగంటి అనుచరులు ప్రభతో కలసి వెళ్ళారు. గ్రామాల్లో మహిళలు, పెద్దలు మాత్రమే ఉన్నారు. అదే అదనుగా భావించి బ్రిటిష్‌ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకుపడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. పుల్లరి చెల్లిస్తామని తాము చెప్పినా బ్రిటిషర్లు దొంగదెబ్బ తీశారు. శిస్తు కడతామని అధికారులతో చెప్పేందుకు వెళ్లిన కన్నెగంటి పై సైనికులు కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి 26 తూటాలు దూసుకుపోయాయి. సాయంకాలం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్థరాత్రి వరకు శక్తి కూడదీసుకొని వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 26 అర్థరాత్రి పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. అలా పుల్లరి పోరాటం చేసి ఎందరికో స్వాతంత్ర్యోద్యమ సమరానికి కన్నెగంటి హనుమంతు దారి చూపారు. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి చిహ్నంగా నిలిచి వుంది.