
1921 మార్చి 31, ఏప్రియల్ 1వ తేదీలలో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మహాసభలు జరిగాయి. 1885లో అఖిల భారత కాంగ్రెస్ అన్ని పార్టీ స్థాపించబడినా ఆంధ్ర ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన జాతీయ మహాసభలు అంతవరకు జరగలేదు. ఆంధ్ర ప్రాంతానికి నడిబొడ్డు అయిన బెజవాడలో ఇవి జరగడానికి కారకులు అయ్యదేవర కాళేశ్వరరావుగారు.
మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి శాశ్వతంగా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1915లో ఆంధ్రదేశాన్ని సందర్శించారు. 1915 మే 4వ తేదీన నెల్లూరు పట్టణంలో 21వ ప్రొవిన్షియల్ మహాసభలు జరిగాయి. అందులో పాల్గొనడానికి మహాత్మాగాంధీ వచ్చారు. ఈ మహాసభలకు ఆనాటి ఆంధ్ర నాయకులు అందరూ హాజరయ్యారు. వారందరికీ మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ సమావేశానికి హాజరయి మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పరచుకుని దానిని పెంపొందించుకున్న వారిలో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఒకరు. 1919 మార్చి 31వ తేదీన గాంధీజీ సికిందరాబాద్ నుంచి బెజవాడకు వచ్చి కాళేశ్వరరావుగారి ఇంట్లో బస చేశారు. 1920లో మౌలాన షౌకత్ అలీతో కలసి, బెజవాడకు వచ్చి కాళేశ్వరావుగారి ఇంట్లో బసచేశారు. ఆ విధంగా గాంధీజీ, కాళేశ్వరరావుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
1920లో నాగపూర్లో విజయరాఘవాచారిగారి అధ్యక్షతన కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అందులో కాళేశ్వరరావుగారు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో కాళేశ్వరరావుగారు తదుపరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను బెజవాడలో జరిపించవలసిందిగా మహాత్మా గాంధీ, చిత్తరంజన్ దాస్, విజయరాఘవాచారి వంటి అగ్రనాయకులకు విజ్ఞప్తి చేశారు. దానికి వారు అనుకూలంగా స్పందించడం వలన బెజవాడలో కాంగ్రెస్ మహాసభలు జరగడానికి రంగం సిద్ధమైంది. ఈ సభల నిర్వహణకు కాళేశ్వరరావుగారి నాయకత్వంలో ఆహ్వాన సంఘం ఏర్పడింది.ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు ఆయన నాయకత్వంలోని రామడందు, వాలంటీర్ల బృందం తోడ్పాటుతో చారిత్రాత్మకమైన ఈ మహాసభలను కాళేశ్వరరావుగారు జయప్రదంగా నిర్వహించారు. ఈ స్ఫూర్తితోనే 1923 చివరలో కాకినాడ పట్టణంలో అఖిలభారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. బెజవాడ మహాసభలు విజయవంతంగా ముగియడంతో ఆంధ్ర నాయకులు జాతీయ కాంగ్రెస్ నాయకుల అభిమానాన్ని ప్రశంసలను చూరగొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చిత్తరంజన్ దాస్ రాజీనామా చేసినప్పుడు పార్టీ తాత్కాలిక అధ్యక్షునిగా కొండా వెంకటప్పయ్యగారు నియమితులయ్యారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు ప్రధాన కార్యదర్శి, కొన్ని నెలలపాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం బెజవాడకు మారింది. ఈ చారిత్రక పరిణామాలన్నింటికీ కాళేశ్వరరావుగారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉంది.
కాళేశ్వరరావుగారు 1881వ సంవత్సరం జనవరి 22వ తేదీన కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు. ప్రాథమిక విద్య ఆ గ్రామంలోనే జరిగింది. ఆ తర్వాత ఆనాటి ప్రధాన విద్యాకేంద్రం బందరు నోబుల్ కాలేజీలో చదివి మద్రాస్ లో లా విద్యను పూర్తిచేశారు. బెజవాడలో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి అనతికాలంలోనే పేరుపడ్డ లాయరుగా స్థిరపడి డబ్బు సంపాదించారు. ఈ లోగా మహాత్మాగాంధీ పిలుపునకు స్పందించి కాసులు పండిస్తున్న వృత్తిని వదులుకుని పూర్తిగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. అన్ని స్వాతంత్య్ర సమర ఘట్టాలలోనూ పాల్గొని జైలుకు వెళ్ళారు. త్రికరణ శుద్ధిగా మహాత్మాగాంధీ చూపిన అహింసాయు మార్గంలో పయనించి స్వాతంత్య్ర సముపార్జనకై తమ సర్వస్వాన్నీ త్యాగంచేసి కల్మషంలేని నాయకుడిగా పేరుగడించారు.





