News

హల్ద్వానీకి అదనపు బలగాలు, మదర్సా కూల్చిన స్థలంలో పోలీస్‌స్టేషన్‌

340views

మదర్సా కూల్చివేత వ్యవహారంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హల్ద్వానీ పట్టణానికి అదనపు పారామిలటరీ బలగాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా మదర్సా నిర్మించారని ఈ నెల 8న స్థానిక మునిసిపల్‌ అధికారులు దాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలకు కారణమైన వారందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. 120 మంది తుపాకుల లైసెన్సులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తీవ్ర స్థాయిలో హింసకు కారణమై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు రూ. 2.44కోట్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ ప్రధాన నిందితుడైన అబ్దుల్‌ మాలిక్‌కు మునిసిపల్‌ అధికారులు రికవరీ నోటీసు జారీ చేశారు. హల్ద్వానీలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఘర్షణలు జరిగిన బన్‌బూల్‌పుర ప్రాంతం మినహా పట్టణంలోని మిగతా చోట్ల కర్ఫూను ఎత్తివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా, మదర్సా కూల్చిన స్థలంలో నూతనంగా పోలీస్‌ స్టేషన్‌ను నిర్మిస్తామని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రకటించారు.