
కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్ ఆదివారం రామనామ స్మరణతో మార్మోగింది. అయోధ్య రామయ్యను కళ్లారా చూసేందుకు రైలులో తరలి వెళ్లారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ – అయోధ్యధామ్ (ఆస్థా అయోధ్య) ప్రత్యేక రైలుకు భక్త జనం జేజేలు మధ్య స్వామి పరిపూర్ణానంద జెండా ఊపారు. సాయంత్రం 5.54 గంటలకు రైలు కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. విజయనగరం, ఒడిశా మీదుగా సుమారు 1882 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మంగళవారం ఉదయం 10.35 గంటలకు అయోధ్యధామ్ చేరుకుంటుంది. అనంతరం బుధవారం రాత్రి 7.55 గంటలకు అయోధ్యధామ్‌లో బయలుదేరి గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు కాకినాడ చేరుకుటుంది.
ఇది చారిత్రక ఘట్టం
సుదీర్ఘకాలం తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని సాధించుకోవడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఎంతోమంది ఎన్నో కష్టాలకు ఓర్చి జీవితాలను త్యాగం చేయడంతో అయోధ్యలో శ్రీరాముని క్షేత్రం నిర్మాణం ప్రధాని మోదీ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. ప్రతి భారతీయుడు అయోధ్యకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రధాని ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించారు. ప్రధాని మోదీకి, రైల్వే శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.-పరిపూర్ణనందస్వామి
ఏళ్ల పోరాట ఫలితం
కాకినాడ జిల్లాకు చెందిన 700 మంది భక్తులు రైలులో బయలుదేరారు. తుని, విశాఖలో మరికొంత మంది భక్తులు ఎక్కుతారు. సుమారు 1300 మంది అయోధ్య చేరుకుంటారు. మొదటి విడతగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 200 రైళ్లు అయోధ్య వెళ్తున్నాయి. ప్రయాణానికి రూ.2,200 వసూలు చేశారు. భోజునం, వసతి అయోధ్య ట్రస్ట్ కల్పిస్తుంది. -చిలుకూరి రామ్‌కుమార్, భాజపా జిల్లా అధ్యక్షుడు





