
333views
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన తొమ్మిది మారుమూల గ్రామాల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 76 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇది చారిత్రక ఘటనగా చెప్పవచ్చు. బస్తర్ ప్రాంతంలో తగ్గుతున్న తీవ్రవాదుల ప్రభావానికి, పెరుగుతున్న భద్రతా ప్రమాణాలకు ఇది ప్రతీక. 1947 నుంచి ఈ గ్రామాలు ఎన్నడూ జాతీయ పతాకావిష్కరణను చూడలేదని పోలీసు అధికారులు తెలిపారు. భద్రతాదళాలతో ఈ గ్రామాలకు సమీపంలో ఏర్పాటుచేసిన కొత్త శిబిరాలు గణతంత్ర వేడుకల నిర్వహణకు మార్గం సుగమం చేశాయన్నారు. ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదానికి కీలక కేంద్రంగా ఉంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నక్సలైట్ల దాడులు గతంలో పలుమార్లు ఇక్కడ జరిగాయి.





