News

జాతీయ సమ్మేళనంగా అయోధ్య

430views

రాజస్థాన్‌లోని మకరానా నుంచి చలువరాయి, బాలరాముడి విగ్రహం తయారీకి కర్ణాటకలోని మైసూరు నుంచి 250 కోట్ల ఏళ్లనాటి కృష్ణశిల, 44 తలుపుల తయారీకి మహారాష్ట్ర అడవుల నుంచి తెచ్చిన టేకు కలప, దేశ రాజధాని నగరం దిల్లీ నుంచి రాముడి అలంకరణ దుస్తులు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లఖ్‌నవూ నుంచి ఆభరణాలు.. ఇలా దేశంలోని నలుమూలల్లో ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కో వస్తువుతో రూపొందిన అయోధ్య రామమందిరం భారతదేశ అసలైన సమ్మేళనానికి చిహ్నంగా నిలుస్తోంది. ఆలయ వాస్తుశిల్పి చంద్రకాంత్‌ సోమ్‌పురా గుజరాత్‌లోని అహ్మదాబాదుకు చెందినవారు. ఇంకా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందకు పైగా నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు ఆలయ నిర్మాణంలో భాగస్వాములైనట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. భారత్‌లోని 2,500కు పైగా ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని పునాదుల్లో వాడామని, 155 దేశాల నుంచి అందిన జలాలతో మూలవిరాట్టుకు అభిషేకం చేసినట్లు వివరించారు.

ప్రాణప్రతిష్ఠ వేళ వినిపించిన మంగళధ్వనిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఘటంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల సంగీత పరికరాలను వాడారు. ఆలయం పక్కనే ఉన్న సరయూ తీరాన 40 వేల చదరపు అడుగుల మేర విద్యుద్దీప కాంతులు వెదజల్లిన ధగధగలు పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన ప్రఖ్యాత చందన్‌నగర్‌కు చెందినవి. చెన్నై, బెంగళూరు, పుణె, లఖ్‌నవూ, దిల్లీ నగరాల నుంచి సేకరించిన చామంతి, జర్‌బెరా వంటి పూలతోపాటు విదేశాల నుంచి తెప్పించిన ఆంథూరియం, లిలియం వంటి 20కు పైగా రకాలతో కూడిన 3,000 కిలోల పూలతో చేసిన అలంకరణ ఆలయ ప్రారంభ వేడుకకు అదనపు సొగసులు అద్దింది. అలాగే బాలరాముడికి సమర్పించిన నైవేద్యాలు సైతం ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌), మెహందీపుర్‌, దౌసా (రాజస్థాన్‌), మథుర (యూపీ) తదిరత ప్రాంతాల నుంచి వచ్చాయి.