News

శ్రీశైల మహా కుంభాభిషేకానికి ముహూర్తం నిర్ణయించండి : హైకోర్టు

313views

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వారంలో ముహూర్తం ఖరారు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ వివరాలను తమ ముందు ఉంచాలని తేల్చిచెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు తర్వాత కూడా.. ముహూర్తం పెట్టేందుకు ఏడు నెలల సమయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎవరిని, ఎప్పుడు సంప్రదించారు.. ఎంతమంది నుంచి సలహాలు తీసుకున్నారు.. వారు ఏ తేదీలు సూచించారు? తదితర వివరాలు చెప్పాలని కమిషనర్‌కు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే కొంతమంది పీఠాధిపతులు, ప్రముఖులను సంప్రదించామని.. మరికొందరిని కలిసి రెండు రోజుల్లో ముహూర్తం నిర్ణయిస్తామని కమిషనర్‌ బదులిచ్చారు. దీంతో వారంలో ముహూర్తం నిర్ణయించాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది.

  • శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ.. అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్‌ ఛైర్మన్‌ సంగాల సాగర్‌ గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. గత మేలో విచారణ జరిపిన హైకోర్టు.. త్వరగా సంప్రదింపులు జరిపి ముహూర్తం ఖరారు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు కమిషనర్‌ వ్యవహరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. హాజరుకు ఆదేశించింది. బుధవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. కమిషనర్‌ న్యాయస్థానానికి హాజరై వివరణ ఇచ్చారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపించారు.
  • ఎవరిని, ఎప్పుడెప్పుడు సంప్రదించారని ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి, శ్రీశైలం పీఠాధిపతి డాక్టర్‌ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివచార్య మహాస్వామి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మను సంప్రదించినట్లు తెలిపారు. మార్చి 12 నుంచి 30 వరకు వివిధ తేదీలను వారు సూచించారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వారంలో ముహూర్తం నిర్ణయించి ఆ వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది.