
అది 1933 సంవత్సరం, ఏప్రిల్ 15వ తేది కాకినాడ. అప్ను రేవులో పడవల చాటుగా ఒక ఎర్రని కాగితంలో చుట్టబడిన ఒక బంతివంటి పదార్థం కన్పించింది. అదేమిటో చెయ్యి తెలుసుకోవాలన్న ఆసక్తితో అక్కడి – పడవల వాళ్ళు దాన్ని తీసుకుని పరీక్షిస్తూ ఉండగా అది ప్రేలింది. అక్కడ ఉన్న వారిలో కొందరికి తీవ్రమైన, మరి కొందరికి స్వల్పమైన గాయాలు తగిలాయి. కాకినాడలో టెర్రరిస్ట్ బాంబు పేలి పెద్ద సంచలనం కలిగించింది. ఈ పేలుడు సంఘటనకు బాధ్యుడు ప్రతివాది భయంకర వెంకటాచార్యులనే నిష్కళంక దేశభక్తుడు. టెర్రరిస్ట్ ఉద్యమంలో చేరాక ఆయన తన పేరును భయంకరాచారిగా మార్చుకున్నాడు.
భయంకరాచారి ఆయన మిత్రుల కార్యకలాపాలను అంతకు ముందు నుంచే కనిపెడుతున్న పోలీసులు ఈ బాంబుపేలుడు సంఘటనకు వారే బాధ్యులని గుర్తించారు. ఐతే పోలీసులు అరెస్ట్ చేయబోగా భయంకరాచారి ప్రభృతులు పారిపోయారు. చిట్టచివరకు డప్పుల సుబ్బారావు కృషివలన కాజీపేట రైలు స్టేషనులో భయంకరాచారి పోలీసులకు దొరికిపోయాడు. ఆయనతోపాటు కొన్ని రహస్య పత్రాలు, రివాల్వర్లు పట్టుబడ్డాయి. వారంరోజులకు ఆయన మిగిలిన అనుచరులను పోలీసులు పట్టుకోగలిగారు.
కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధికెక్కిన ఈ బాంబు కేసులో ప్రధాన ముద్దాయి భయంకరాచారి. మిగిలిన ఐదుగురు సి. నరసింహాచారి, సి. సత్యనారాయణచారి, కాకరాల కామేశ్వరరావు, చల్లా అప్పారావు, ఓరుగంటి రామచంద్రయ్యలు. హైకోర్టు వరకు వెళ్ళిన ఈ కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా బి.యల్. యతిరాజు పని చేయగా నిందితుల తరపున అప్పటి ప్రసిద్ధ న్యాయవాది బస్సు జగన్నాథదాసు వాదించారు. మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తులు మాధవన్ నాయర్, ఒల్నేలు ఈ కేసును విచారించారు.
బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రపన్నారన్న ప్రాసిక్యూషన్ వారి వాదనకు న్యాయమూర్తులు అంగీకరించలేదు. ఐతే ఆయుధాలు తయారుచేయడం,మారణాయుధాలు కలిగి ఉండడం తీవ్రమైన నేరాలుగా న్యాయమూర్తులు పరిగణించి ప్రధాన నిందితుడయిన భయంకరాచారికి కఠినమైన ద్వీపాంతరవాస శిక్ష విధించారు. మిగిలినవారిని విడిచిపెట్టారు. ఆయన అండమాన్ దీవులలో సుదీర్ఘకాలం ప్రవాస జైలుశిక్ష అనుభవించారు. కన్నవారికి, కట్టుకున్నవారికి కనీస చూపుకు, పలకరింపులకు కూడా నోచుకోకుండా దుర్భరమైన జైలు జీవితాన్ని దుఃఖ భూయిష్టం గావించుకోకుండా, తోటి ఖైదీలలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపడానికి శ్రీ భయంకరాచారి అహర్నిశలు శ్రమించాడు. వ్యక్తిగత, సామాజిక, సాంఘిక జీవితాన్ని త్యాగం చేసి భరతమాత దాస్యశృంఖలాల ఛేదనే లక్ష్యంగా శ్రమించిన దేశభక్తుడు శ్రీ భయంకరాచారి. భయంకరాచారి తన జైలు జీవితం గురించి ఒక పుస్తకం రాశారు.
బహుశ ఇప్పటి తరంవారికి ఆనాటి దేశభక్తులు చేసిన త్యాగాలు, చూపిన సాహసం తెలియకపోవచ్చు. వారి త్యాగఫలితాలనే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, వారు విస్మృత వీరులు కావడానికి వీల్లేదు.




