ArticlesNews

బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ మన నేతాజీ

410views

(23 జనవరి – నేతాజీ జయంతి)

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం పోరాటాల మయం. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వలస పాలకులపై యుద్ధ భూమి నుండి నేరుగా పోరాడిన నేత. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొత్తం ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో, సాధారణ ప్రయాణికులకే శ్రేయస్కరం కానీ ప్రమాదకర పరిస్థితుల్లోనూ వివిధ దేశాల్లో సాహసోపేత పర్యటనలు జరిపి, భారత దేశ స్వాతంత్య్రం కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసిన సాహస యోధుడు. బహుశా ప్రపంచ చరిత్రలో ఆయనతో పోల్చదగిన యోధుడు మరొకరు ఉండరు. బ్రిటిష్ వారి నుండి భారత్‌ను విముక్తి చేస్తున్నట్లు ప్రకటించి, జాతీయ ప్రభుత్వాన్ని ప్రకటించిన యోధుడు. భారత్ లో తమ స్థానం పదిలంగా ఉందని భావించినా భారత్ లో ఇక్కడే ఉండడం క్షేమకరం కాదనేలా బ్రిటిష్ వారిలో భయాన్ని కలిగించిన అద్భుతమైన నేత.

సుభాష్ చంద్రబోస్ ఉత్తేజభరితమైన నాయకత్వం కేవలం భారత దేశంకే కాదు ప్రపంచంలోని సుమారు 60 దేశాలు దాదాపు ఒకే సమయంలో స్వతంత్రం పొందడానికి స్ఫూర్తి ఇచ్చారు. నేతాజీ పిలుపుతో వేలాది మంది యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక మహోన్నతమైన సైన్యాన్ని సృష్టించాడు. నేతాజీ 1897లో ఒడిశాలోని కటక్‌లో జన్మించారు. తండ్రి జానకీ నాథ్. తల్లి ప్రభావతీ బోస్. చిన్న నాటి నుంచే విద్యారంగంలో రాణించిన సుభాష్ చంద్రబోస్ కోల్‌కతా నుండి పట్టభద్రుడయ్యారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి కావడం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నారు. కానీ అతను తన ఉద్యోగంతో వచ్చిన సౌకర్యాలు, హోదాతో కూడిన జీవితానికి అలవాటుపడలేదు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని మనస్పూర్తిగా స్వీకరించడమే కాకుండా, తన వ్యక్తిగత సౌఖ్యాలు, కుటుంబ బాంధవ్యాలను కూడా వదులుకున్నారు.

“నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను” అనే నినాదంతో సుభాష్ చంద్రబోస్ దేశ ప్రజలను జాగృతం చేశారు. ఆయన దార్శనికత, వ్యక్తిత్వం, తేజస్సు అటువంటిది. అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొంది, ప్రజలకు “నేతాజీ” గా మారారు. నేతాజీ భారతదేశ తీరాన్ని దాటి స్వాతంత్య్ర పోరాట జ్యోతిని వెలిగించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో యుద్దభూమిలోకి ఒక సైన్యంతో దిగి బ్రిటిష్ పాలకులకు నిద్రను కరువు చేశారు. డిల్లీ ఛలో నినాదాన్ని అందించారు. ఆయన నిర్మించిన 60,000 మంది సైన్యంలోని వేలాది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు.

“విజయం ఎల్లప్పుడూ వైఫల్యాల స్తంభంపైనే నిలుస్తుంది” అనే జీవిత సత్యం ఆయనను ప్రభావితం చేసింది. అందుకనే తాత్కాలిక అపజయాలతో ఆయన ఎన్నడూ నిరాశ చెందలేదు. తన స్వాతంత్య్ర కాంక్ష నుండి వెనుకడుగు వేయలేదు. నేతాజీ అనేక సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నారు, కానీ ఆ వైఫల్యాలనే ఆయన తన పోరాటంతో విజయంగా మార్చుకున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను 1956లో కోల్‌కతాకు వచ్చాడు. ఆ సమయంలో, అతనికి ఆతిధ్యం ఇచ్చిన గవర్నర్, మాజీ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిబి చక్రవర్తి, భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలనే బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటో అతని నుండి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అట్లీ స్పందిస్తూ, బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న కారణంగా.. బ్రిటిష్ రాజ్యానికి భారత సైన్యం, నావికాదళం యొక్క విధేయత తగ్గిపోతూ ఉండడమే ప్రధాన కారణం అని స్పష్టం చేశారు. అంటే అప్పటికి జీవించి ఉన్నారో లేదో కూడా తెలియని నేతాజీ గురించిన భయంతోనే వారు భారత్‌ను వదిలి వెళ్లారని స్పష్టం అవుతుంది.

భారత నాయకత్వానికి ప్రపంచ గుర్తింపును అందించిన ఘనత బోస్‌దే. అంతకుముందు, స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఔన్నత్యం పట్ల ప్రపంచానికి జ్ఞానోదయం చేశారు. నేతాజీ భారతీయుల పరాక్రమాన్ని ప్రపంచానికి చూపించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి భగవద్గీత గొప్ప ప్రేరణ అని సుభాష్ చంద్రబోస్ విశ్వసించారు. సార్వత్రికతపై స్వామి వివేకానంద బోధనలు, ఆయన వ్యక్తపరచిన జాతీయవాద ఆలోచనలు, సామాజిక సేవ, సంస్కరణలపై ధృడమైన విశ్వాసాలు అన్ని నేతాజీని విశేషంగా ప్రేరేపించాయి. నేతాజీ జీవితం దేశ భవిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం, ఆదర్శవంతం..