News

చంద్రయాన్‌-3.. స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్‌.. ఇస్రో కీలక అప్‌డేట్‌

207views

చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్‌డేట్‌ అందించింది. చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుందని సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్‌, సెప్టెంబర్‌ 4న ల్యాండర్‌ను స్లీప్‌ మోడ్‌లో ఉంచారు. అయితే చంద్రయాన్‌-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను బెంగళూరులో వారు ధ్రువీకరించారు.

అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌లో వివిధ దేశాలకు చెందిన కొన్ని పరికరాలను అమర్చారు. అయితే అందులో నాసాకు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ)లోని లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ అరే (ఎల్‌ఆర్‌ఏ) చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని తెలిపారు. డిసెంబరు 12 నుంచి ఎల్‌ఆర్‌ఏ నుంచి సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది.

చంద్రయాన్‌-3లో పలు సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ నిత్యం పనిచేస్తోందని ఇస్రో చెప్పింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్‌ఆర్‌ఏ పర్యవేక్షణ ప్రారంభిస్తుంది. చంద్రయాన్‌-3లోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేశారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.