
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం జనవరి 16న ఘనంగా జరగనుందని అదేరోజున గోదాపరిణయోత్సవం నిర్వహిస్తామని టీటీడి తెలిపింది.గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
ఆర్జితసేవలు రద్దు :
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
జనవరి 16న ఎస్వీ గోశాలలో కనుమ గోపూజ
సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని జనవరి 16వ తేదీ మంగళవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ ఘనంగా జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, శ్రీ వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహిస్తారు. అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్య కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.





