ArticlesNews

విశ్వవ్యాప్త రామాయణం

394views

జనవరి 22 న జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.శ్రీ రాముని జీవితాన్ని తెలిపే రామాయణ ఇతిహాసం భారతదేశం సరిహద్దులను దాటి విస్తరించింది.

భారతీయుల దృష్టిలో రాముడు ఈ భూమి మీద నడయాడిన ఒక అవతారం. ఆ అవతారానికి సాక్షిగా నిలిచి, ఆయన జీవితాన్ని కావ్యీకరించిన రుషి వాల్మీకి. వాల్మీకి రాసిన రామాయణమే కాకుండా దాని స్ఫూర్తిగా అనేక రామాయణాలు ప్రచారంలో ఉన్నాయి.ఇవి భారత్ కి మాత్రమే పరిమితం కాలేదు.ముస్లిం పాలన ఉన్న దేశాల్లో సైతం రామాయణం ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఆగ్నేయాసియాలో రామాయణం జీవనాన్ని ప్రభావితం చేసింది.శ్రీ రాముడు ఆదర్శ పాలకుడుగా అనేక సమాజాలలో ఈనాటికీ పూజలను అందుకుంటున్నాడు.

వేయి సంవత్సరాల క్రితమే మన దేశంలోని నౌకాయానం గణనీయంగా అభివృద్ధి చెందింది. మన దేశం నుంచి వజ్రాలు మొదలుకొని మసాలా దినుసుల వరకూ విదేశాలకు ఎగుమతి చేసేవారు. ముఖ్యంగా దక్షిణాసియాకు ఈ ఎగుమతులు శాశ్వతమైన వ్యాపార సంబంధాలను ఏర్పరుచుకునే స్థాయిలో ఉండేవి. అలా భారత దేశం నుంచి దక్షిణాసియా దేశాలకు చేరుకున్న వర్తకులుతో పాటుగా మన దేశపు ఆచార వ్యవహారాలను, ఐతిహాసాలను కూడా ఇతర దేశాలను ప్రభావితం చేశాయి. అలా విదేశాలలో సైతం విస్తృతం ప్రచారం పొందిన గాథలలో రామాయణానిదే అగ్రతాంబూలం.

కేవలం హిందువులే కాదు,ముఖ్యంగా ఆగ్నేయ మరియు తూర్పు ఆసియాలోని మలేషియా, ఇండోనేషియా మరియు థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ప్రజలు రాముడిని వివిధ రూపాల్లో పూజిస్తారు. రామాయణ ప్రభావం జపాన్, కొరియా, చైనా యొక్క సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన విధానాలలోకి కూడా ప్రవేశించింది.

మీకు తెలుసా థాయ్‌లాండ్ జాతీయ పుస్తకం రామకియన్ అని. అంటే అది రామయణం. ఎలా తెలుస్తుంది, మన సిలబస్‌లో ఎన్నడూ రామాయణమనేదే లేదు.

అందుకే ఈ విషయం చాలా మందికి తెలియకుండా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా స్వరూపాల్లో రామాయణ గాథలు వ్యాప్తిలో ఉన్నాయి.

భారత్‌ను మినహాయిస్తే, 9 ఇతర దేశాల్లో రామ కథ చెబుతారు, గానం చేస్తారు.థాయ్‌లాండ్‌లోనే కాకుండా మయన్మార్‌లో రామాయణాన్ని యమయాన్ అంటారు. ఇది అనధికారిక బర్మా జాతీయ మహాకావ్యంగా పరిగణించబడుతోంది.

ఆసక్తికర విషయం ఏంటంటే, ఇండొనేషియా..నేడు ప్రధానంగా ముస్లిం దేశంగా ఉన్నా..అక్కడ 4 రకాల రామాయణాలు కూడా ప్రబలంగా ఉన్నాయి.కాకవిన్ రామాయణం, యోగేశ్వర రామాయణం, రామకవచ రామాయణం, స్వర్ణ దీప రామాయణం

కంబోడియాలో రామాయణాన్ని రీమ్‌కర్ అని పిలుస్తారు అంటే రామాయణ కీర్తి లేదా రాముని కీర్తి

రామాయణాన్ని మలేషియాలో హికాయత్ సేరి రామా గా పిలుస్తారు.జావా ద్వీపపు కాకావిన్ రామాయణం జావా కళాత్మక వ్యక్తీకరణకు పరాకాష్టగా చెప్తారు

మరింత ఆశ్చర్యకర విషయం ఏంటంటే, సోనియా జీ కి చెందిన ఇటలీలో ఒక నగరంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల సమయంలో ఇళ్ల గోడలపై రామాయణంలోని దృశ్యాల ఆధారంగా చిత్రాలు కనిపించాయి.

ఇలా ఇతర దేశాల్లోనూ ఆదర్శమూర్తిగా, చెడు మీద విజయాన్ని సాధించిన విజేతగా రాముడు ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి ఒక గొప్ప ఉదాహరణే! అందుకనే రామాయణం ఏ ప్రాంతంలోకి ప్రవేశించినా కూడా, అక్కడి ప్రజల మన్ననను పొందింది. రాముడు మన దేశంలోనివాడే అన్నంతగా వారు ఆయనను కొలుచుకున్నారు. అందుకు వాల్మీకి రాసిన రామాయణమే వారికి ప్రేరణనిచ్చింది. అలా అది ప్రపంచకావ్యంగా నిలిచింది.