
ఎందరో వీరుల పోరాటాలు, ప్రాణత్యాగాలే ఈ నాటి ఈ స్వాతంత్రం. ఆ పోరాటాల్లో 1857 తిరుగుబాటు ప్రధానమైనది. వీరసావర్కర్ ఈ తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలిచాడు. సంగ్రామంగా పిలవడానికి కారణం దీనిలో అన్ని ప్రాంతాలు పాల్గొన్నాయి. వారందరిదీ ఒకటే గమ్యం అది భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాన్య శృంఖలాల నుండి విముక్తి చేయడం. ఈ సంగ్రామంలో పాల్గొన్న ముఖ్యులు ఝాన్సీలో లక్ష్మీ బాయి, బీహార్లో కుంవర్ సింగ్, ఢిల్లీలో బహదూర్ షా జాఫర్, ఉత్తర ప్రదేశ్ బిడూరులో నానాసాహెబ్, అతని జనరల్ గా పనిచేసిన తాంతియా తోపే, లక్నోలో బేగం హజరత్ మహల్ చరిత్రకు తెలిసిన వీరులు. వీరేకాక అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. కర్నూలులోని ఉయ్యాలవాడకు చెందిన మజ్జారి నరసింహారెడ్డి, గోదావరి జిల్లాకు చెందిన కోరుకొండ సుబ్బారెడ్డి, కోర్ల వెంకట సుబ్బారెడ్డి, కొచ్చర్లకోట రామబ్రహ్మం ఈ కోవలోని వాళ్ళే.
‘కొరుటూరు’ గ్రామానికి చెందిన కోరుకొండ సుబ్బారెడ్డి అతని కుమారుడు ముంగారెడ్డి, ‘కొండమొదలు’ గ్రామానికి చెందిన రామిరెడ్డి అతని కుమారుడు లింగారెడ్డి గోదావరిపై రవాణా పన్ను వసూలు వసూలు చేసుకుంటూ ఉండేవారు, అయితే ఈ వ్యవహారమంతా సుబ్బారెడ్డే చూసుకుంటూ రామారెడ్డి వాటా అతనికి పంపిస్తూ ఉండేవాడు. 1852లో నాటి సబ్ కలెక్టర్ ఈ వసూలు చట్ట వ్యతిరేకమని, అతిక్రమిస్తే శిక్షార్హమని ప్రకటించాడు. దీనికితోడు “నాగవరం” ఎస్టేట్ విషయంలో వారసత్వ తగాదా బ్రిటిష్ కోర్టులో సుబ్బారెడ్డికి, లక్ష్మీ నరసమ్మకు మధ్య జరుగుతుంది. లక్ష్మీ నరసమ్మకు ఒక బంధువు ఉంది. ఆమె పేరు సీతమ్మ. ఆమె కూడా నాగవరం వారసురాలే. వీళ్ళిద్దరూ వితంతువులే.
బ్రిటిష్ వారు “నాగవరం” ఎస్టేట్ కి వారసురాలిగా లక్ష్మీ నరసమ్మను ఆమె బంధువు సీతమ్మను ప్రకటించారు. మగదిక్కు లేదు గనుక మంగారెడ్డిని దత్తత జేసుకొని సీతమ్మనిచ్చి వివాహం చేస్తే ఈ రెండు వర్గాల వైరం ఉండదు అనుకున్నదిలక్ష్మీ నరసమ్మ. ఇదే సమయంలో కోరుకొండ సుబ్బారెడ్డికి శత్రువు ప్రభుత్వ ఉద్యోగి, అయిన సుంకర స్వామి “బుట్టాయిగూడెం” మున్సిఫ్ గా నియమింపబడ్డారు. కొచ్చర్లకోట రామబ్రహ్మం ఓ కలప వ్యాపారి. బాగా చదువుకున్నవాడు. స్వాతంత్రభావాలు ఉన్నవాడు. భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య శృంఖలాలనుండి విముక్తి చేయాలని అహర్నిశం ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. తనకు ఏ చిన్న అవకాశం దొరికినా దీని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. ఈలోగా తన మిత్రుడు కోరుకొండ సుబ్బారెడ్డికి బ్రిటిష్ వారు అన్యాయం చేస్తున్నారని తెలిసింది. ఆ అన్యాయాన్ని ఆసరాగా చేసుకుని సుబ్బారెడ్డిలో దేశభక్తి రేకెత్తించాడు. ఉత్తర భారతంలో జరుగుతున్న 1857 తిరుగుబాటు గురించి నానాసాహెబ్, తాంతియా తోపేల వీరోచిత పోరాటాలను గురించి రోజూ చెబుతూ ఉండేవాడు. ఆ విధంగా ప్రభావితుడైన కోరుకొండ సుబ్బారెడ్డి తాను సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడ్డాడు.
సెప్టెంబర్ 17, 1857న కోరుకొండ సుబ్బారెడ్డి 400 మంది తిరుగుబాటుదారితో బుట్టాయిగూడెం వెళ్లి సుంకర స్వామిని, సీతమ్మను, నలుగురు సేవకులను బందీలుగా చేసి, అక్కడి నుండి నాగవరం వెళ్లి కోటను వశపరచుకొని, కొప్పల్లి, కన్నాపురం, పాత నాగవరం, తాళ్లపూడి, గూటాల గ్రామాల్లోని గ్రామస్తులను పన్ను తనకే కట్టాలని ప్రకటన చేయించాడు.
ప్రభుత్వం వెంటనే ‘మెలనీ’ అనే సహాయక మెజిస్ట్రేట్, తాళ్లపూడి తాసిల్దారు ఓ అరవై మంది సైనికులను తీసుకొని బుట్టాయిగూడెంలో మకాం వేశారు. అదును చూసుకుని తెలివిగా కోరుకొండ సుబ్బారెడ్డి దగ్గర బందీలుగా ఉన్న సుంకర స్వామిని సీతమ్మను, నలుగురు సైనికులను విడుదల చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న కోరుకొండ సుబ్బారెడ్డి అనుచరుడు కొర్ల వెంకట సుబ్బారెడ్డి 600 మంది తిరుగుబాటు సైన్యంతో మెలనీపై విరుచుకుపడి సుంకర స్వామి వర్గాన్ని తమ ఆధీనంలో తీసుకోని బుట్టాయిగూడెం వదిలి వెళ్లకపోతే సుంకర స్వామి వర్గాన్ని చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశాడు.
నమ్మకద్రోహులందించిన సమాచారంతో సుబ్బారెడ్డిని 1858 జూన్ 11న బ్రిటీషర్లు నిర్భంధించారు. విచారణ సందర్భంగా నానా సాహెబ్ ఆదేశాల మేరకే తాను స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నానని, తనకు స్ఫూర్తి తాంతియా తోపే అని సుబ్బారెడ్డి నిర్భయంగా చెప్పారు. బ్రిటీష్ వారిని అంతగా భయబ్రాంతులను చేసిన కోరుకోపెడ సుబ్బారెడ్డిని వలసపాలకులు తమ కుయుక్తులతో బంధించి అక్టోబరు 7, 185 ఉరితీసారు.





