News

సత్యదేవునికి సరికొత్త రథాలు

357views

అన్నవరం సత్యనారాయణ స్వామికి 34.1 అడుగుల ఎత్తు ఉండే భారీ రథం తయారవుతోంది. సత్యదేవుని కల్యాణోత్సవాల సమయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపునకు ఈ రథాన్ని సిద్ధం చేస్తున్నారు. వ్యయం అంచనా సుమారు రూ.1.08 కోట్లు. టేకు కలప వినియోగిస్తున్నారు. 14.5 అడుగుల ఎత్తులో ఉండే వేరొక చిన్న రథం ఇప్పటికే సిద్ధమైంది. ఈ రథానికి రూ.58 లక్షలతో వెండి రేకు తాపడం చేయనున్నారు. ఇందుకు సుమారు 400 కేజీల వెండి అవసరమని అంచనా.

పెద్దది ఇలా..
ఎత్తు 34.1 అడుగులు, వెడల్పు, లోతు 13.6 అడుగులు. అయిదు అంతస్తులు. 5.10 అడుగుల ఎత్తున ఆరు చక్రాలు. 5.3 అడుగుల్లో మొదటి అంతస్తు. 4.9 అడుగుల ఎత్తులో రెండో అంతస్తు. దీంట్లో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు సింహాసనం.. వెనుక మకర తోరణం ఏర్పాటు చేస్తారు. 4, 3 అడుగుల ఎత్తుల్లో ఆ తర్వాతి అంతస్తులుంటాయి. 7.6 అడుగుల ఎత్తులో శిఖరం. ముందు రెండు గుర్రాలు, ద్వారపాలకులు, పైన శంకు, చక్ర నామాలతో రథాన్ని నయనానందకరంగా నిర్మించనున్నారు.

చిన్నది
400 కేజీల వెండి రేకు తాపడం చేస్తారు. దేవస్థానంలో అందుబాటులో ఉన్న వెండి లేదా దాతల సహకారంతో సమకూరుస్తారు. ఈ రథాన్ని 14.5 అడుగుల ఎత్తు, వెడల్పు, లోతు 6.5 అడుగులతో ఇప్పటికే తయారు చేశారు. నాలుగు చక్రాలతో ఈ రథంలో స్వామి, అమ్మవార్లను ఆసీనులను చేసేందుకు నాలుగు స్తంభాల మండపంలో పీఠం, ఆ వెనుక సింహాసనం నిర్మించారు. ముందు భాగంలో రెండు గుర్రాలు అమర్చారు. రథంపై దేవతామూర్తుల ఆకృతులు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు రథాలను ఈ ఏడాది మార్చి చివరి నాటికి పూర్తి చేయించాలని సంకల్పించారు.