
బాలాకోట్‌లో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత భారత్ సముద్ర మార్గం ద్వారా కూడా దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన జలాంతర్గామి పీఎన్ఎస్ సాద్ పాక్ జలాల నుంచి మాయమైనట్లు భారత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మిగతా యుద్ధ నౌకలతో పోలిస్తే పీఎన్ఎస్ సాద్‌లో అత్యాధునిక వ్యవస్థ కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇది కనిపించకపోవడంతో భారత్ జలాల్లోకి ప్రవేశించి ఉంటుందన్న అనుమానం భారత నేవీకి వచ్చింది.
రోజులు గడిచేకొద్దీ పీఎన్ఎస్ సాద్ కోసం వేటను వేగవంతం చేసింది భారత నేవీ. ఇందుకోసం శాటిలైట్ లొకేటర్లను కూడా వినియోగించింది. మరోవైపు పాకిస్తాన్ ఈ అధునాతన జలాంతర్గామిని ఎక్కడైనా దాచేశారా అన్న అనుమానం కూడా వ్యక్తం చేసింది. అయితే 21 రోజుల నిరంతర సెర్చ్ ఆపరేషన్ తర్వాత పీఎన్ఎస్ సాద్ పాక్ పశ్చిమ తీరంలో కనుగొన్నారు. బాలాకోట్‌లో భారత్ దాడులు జరిపిన తర్వాత పీఎన్ఎస్ సాద్ జలాంతర్గామిని కూడా ధ్వంసం చేస్తారేమో అన్న అనుమానంతో పాక్ పీఎన్ఎస్ సాద్ ను అక్కడ దాచినట్లు సమాచారం. అరేబియన్ సముద్రంలో నేవీ పూర్తిస్థాయి నిఘా ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు పాకిస్తాన్ నేవీకి సంబంధించిన సమాచారం కూడా భారత్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేస్తుందన్న అనుమానం రావడంతో ఆ దేశం తమ అత్యంత విలువైన యుద్ధనౌకలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మక్రాన్ తీరంలో ఉంచారని భారత నేవీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ ఒకనొక సమయంలో చెప్పారు.





