
బీహార్‌లోని ముజఫర్‌పూర్ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (ఎస్‌కేఎంసీహెచ్) పక్కన శనివారంనాడు గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఆసుపత్రిలో ఈనెల 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 127 మంది చిన్నారుల మెదడువాపు సంబంధిత వ్యాధితో మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి పోస్టుమార్టం గది పక్కనే గల డంపింగ్ యార్డులో శనివారం కొన్ని అస్థిపంజరాలు కనిపించడంతో మళ్లీ అలజడి రేగింది. ‘పోస్టుమార్టం అనంతరం గుర్తు తెలియని మృతదేహాలను పూడ్చిపెడతాం.
కానీ ఇపుడు కన్పిస్తున్న అస్థిపంజరాలను పూడ్చిపెట్టిన చోట నుంచే తీసుకువచ్చినట్టు అనుమానంగా ఉంది’ అని ఎస్‌కేఎంసీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. ‘పోస్టుమార్టం విభాగం మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ప్రిన్సిపాల్ నియంత్రణలో ఉంది. ఇపుడు పోస్టుమార్టం గదికి సమీపంలో కనిపించిన అస్థిపంజరాల విషయమై ఒక కమిటీ ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతాను’ అని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. శనివారంనాడు అస్థిపంజరాలు కనిపించిన విషయమై వివిధ న్యూస్ చానెళ్లలో విస్తృతంగా ప్రసారం కావడంతో జిల్లా పాలనా యంత్రాంగంతోపాటు తూర్పు సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ కుందన్ కుమార్, సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ కుమార్ వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపాకే దీనిపై మాట్లాడతామని ఎస్పీ మీడియాకు స్పష్టం చేశారు.





