భారత్ లో మత స్వేచ్ఛ లేదు : అమెరికా రిపోర్టు : మా దేశంలో పరిస్థితులపై మీరు రిపోర్టివ్వడమేమిటి? :మండిపడ్డ భారత్

అమెరికా భారత్‌ల మధ్య ఇప్పటికే కాస్త వాణిజ్యపరంగా దూరం పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఇచ్చిన ఓ రిపోర్టు ఇప్పుడు ఇరుదేశాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. ఆయాదేశాల్లో మత స్వేచ్ఛపై అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో హిందూ అతివాద సంస్థలు భారత్‌లో ఉన్న మైనార్టీ వర్గాలపై దాడులు చేశాయంటూ పేర్కొంది. ముఖ్యంగా బీఫ్ కోసం గోవులను ముస్లింలు చంపుతున్నారన్న నెపంతో హిందూ అతివాదులు చాలామందిపై దాడి చేసి కొందరిని చంపినట్లు నివేదికలో పేర్కొంది.
అమెరికా చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ లౌకికవాదం ఉన్న దేశమని, భారత్‌లో నివసించే ప్రతిఒక్కరూ దేశంలో నివసిస్తున్నందుకు ఎంతో గర్వపడతారని విదేశీవ్యవహారాలశాఖ కార్యదర్శి రవీష్ కుమార్ అన్నారు . భారత్‌లో ఎన్నో మతాలు ఉన్నాయని, ప్రతిఒక్కరూ మరొక మతాన్ని గౌరవిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా ఇచ్చిన నివేదికను ఆయన ఖండించారు.దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం రాజ్యాంగ హక్కులను ప్రసాదిస్తోందని చెప్పారు. భారత్‌లో మతస్వేచ్ఛ ఉందని, అది ప్రతి మతానికి వర్తిస్తుందని చెప్పిన రవీష్ కుమార్… ప్రజాస్వామ్య పాలనలో ప్రాథమిక హక్కులను ఎవరూ కాలరాయలేరని ఆయన అన్నారు. అసలు భారత్‌లో పరిస్థితులపై ఒక విదేశీ ప్రభుత్వం నివేదిక ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. భారతదేశంలో ఒక పౌరుడికి ఉన్న రాజ్యాంగ హక్కులను విదేశీ ప్రభుత్వం ప్రశ్నించడమేంటని రవీష్ అన్నారు.





