
అయోధ్య ఉగ్రదాడి (2005)లో ప్రయాగారాజ్ లోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి జీవిత ఖైదు విధించింది. మరొక నిందితుడిని నిర్దోషిగా తేలుస్తూ వదిలేసింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి దినేష్ చంద్ర వాదనలు విన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇన్నాళ్ళూ నాయిని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. నిందితులు ఇర్ఫాన్ మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ సమీం, మొహమ్మద్ అజీజ్, ఆసిఫ్ ఇక్బాల్, ఫరూక్లు ఇన్నాళ్ళూ విచారణ ఎదుర్కున్నారు.
కాగా, ఈ ఉగ్రదాడిలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు జైషే మొహమ్మద్ సభ్యులు కాగా ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు వీరంతా సాయం చేశారన్న అనుమానంతో అప్పట్లో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి చేసిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఆ రోజే మట్టుబెట్టాయి. ఇప్పటివరకు 63 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. నాయిని జైలు నుంచి నిందితులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణలో పాల్గొన్నారు.





