
బహుశా శిల కూడా కన్నీరు పెడుతుందేమో పాకిస్తాన్లోని హిందువుల కష్టాలను చూసి. అందుకేనేమో వాళ్ళని పలకరించాలి, ప్రశ్నించాలి అని వెళ్ళిన మా గొంతులు మూగబోతున్నాయి. ఇంతలో కష్టాల ప్రపంచంలో చిరునవ్వుల సవ్వడి వినిపించింది. ఒక్కసారి మా ముఖాల్లో తెలియని అనందం, ఆశ్చర్యం. మా కన్నులు నాలుగు దిక్కులు కలియచూసాయి. మా అడుగులు మాకంటే ముందే నవ్వుల వైపు పరుగులు పెట్టాయి.
కొద్ది దూరంలోనే చిన్న గుడిసె కనపడింది. అందులో నుంచే నవ్వులు వినబడుతున్నాయి. అక్కడే కనబడింది. మా మనసులు దోచిన నవ్వుల కోకిల. నీ పేరేంటని అడిగితే భయంతో పక్కనే ఉన్న అక్క వెనకకు వెళ్లి దాక్కుని చూస్తోంది. మళ్ళీ నీ పేరేంటని అడిగితే అక్కడున్న ఆమె కళ్ళతో సైగ చేసింది. అప్పుడు మాట్లాడింది.
ఆమె పేరు “ రజ్వంతి”. వయసు 13 సం. ఉంటాయి. వెంటనే వివరాలు చెప్పదని కొంతసేపు చనువు కోసం వాళ్ళతో అడుకున్నాం. అందరికీ వేడి చాయ్ రప్పించి తాగుతూ మాట్లాడటం మొదలు పెట్టాం. పక్కన ఉన్నది రజ్వంతి తమ్ముడు సుందర్ లాల్. ఆమె మీ అమ్మ అని అడిగితే రజ్వంతి ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. కన్నీటిని కారుస్తూ ఏడ్వడం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తోందో మాకు అర్ధం కాలేదు. అక్కడ ఉన్న అక్కను ఏమైందని అడిగితే ఆమె కుడా ఏమి మాట్లాడటం లేదు. కాసేపటికి మళ్ళీ ఏదో సైగ చేసింది.
రజ్వంతి మాట్లాడటం మొదలు పెట్టింది. మాది పాకిస్థాన్. అక్కడ మా అమ్మ నాన్న కూలి చేస్తూ మమ్మల్ని చదివించే వారు. మా ఊరిలో ఉన్న చిన్న గుడికి రోజు తీసుకు వెళ్లి మా అమ్మ మా చేత మొక్కించేది. ఇంట్లో మాకు మా స్నేహితులకి దేవుడి పాటలు నేర్పించేది. నాన్న దగ్గరకి ప్రతి రోజు చాలా మంది కూలీలు వచ్చేవారు. ఒక్కోసారి వాళ్ళందరితో కలసి మా ఇంట్లోనే అన్నం తినే వాళ్ళం.
ఒకరోజు కొంతమంది ముస్లింలు మా ఇంటికి వచ్చారు. మమ్మల్ని బయటకి లాక్కువచ్చారు. అమ్మను జుట్టు పట్టుకుని ఎక్కడికో లాక్కుపోతున్నారు. అడ్డం వచ్చిన మా నాన్నను దారుణంగా కొట్టి కత్తులతో పొడిచి చంపేశారు. అనగానే ఆమె గుండెలో నుంచి ఏడుపు తన్నుకొచ్చింది. మమ్మల్ని వదిలేయమని అంత బాధలోనూ మా అమ్మ వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది. అందుకేనేమో మమ్మల్ని వదిలేసి అమ్మను ఎక్కడికో తీసుకుపోయారు.
అప్పుడు ఈ అక్కే మమ్మల్ని చేరదీసి అన్నం పెట్టింది. అమ్మలా మమ్మల్ని చూసుకుంటోంది. ఆమెకు మాటలురావు. నాలుగు రోజుల తరువాత మా వీధిలోని వారందరూ గుడివైపు పరుగులు పెడుతున్నారు. ఈ అక్క మమ్మల్ని కుడా తీసుకువెళ్ళింది. అందరూ ఏడుస్తున్నారు. ఎందుకో మాకు అర్ధం కాలేదు. ముందుకు పోయి చూస్తే కనబడింది. గుడి గుమ్మానికి మా అమ్మ తలని వేలాడుతోంది. గుడి లోపల మా అమ్మ శరీరం పడి ఉంది. కానీ ఏ ఒక్కరు లోపలికి వెళ్ళడం లేదు.
అమ్మ ఒళ్ళంతా కాలిన గుర్తులు, చాలా చోట్ల చర్మం లేదు. అంతా రక్తంతో నిండిపోయింది. అమ్మ దగ్గరికి పోయి మేము ఏడుస్తుంటే ఏ ఒక్కరు దగ్గరికి రాలేదు. అప్పుడు అర్ధమైంది. ఎవరైనా తాకితే వాళ్లకి ఇలాగే జరుగుతుందని అక్కడ రక్తంతో రాసి ఉంది. అని ఏడుస్తూ చెప్పింది. మేము బడికి పొతే అక్కడ మాకు రోజూ ఖురాన్ నేర్పేవారు. నమాజ్ చేయించే వారు. లేదంటే కొట్టేవారు. అక్కడి పిల్లలందరూ మమ్మల్ని కాఫిర్లు అని ఎగతాలి చేసేవారు.
ఒక రోజు ఈ అక్క తనతో మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది. ఇక్కడ సంతోషం గా ఉన్నాం. అందరూ ఆనందంగా ఉన్నారు. రోజు బడికి పోతున్నాం. మాకు పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అమ్మా నాన్న ఉంటే ఎంత బాగుండేదో అని ఆ పసి హృదయం అంటుంటే ఎందుకో తెలియదు మా గుండెలు బరువెక్కాయి.
- నారద.





