
మైసూరులో దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని మావటి తెలిపాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో భక్తులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఘటనపై విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. బెంగళూరులో ఇలాగే చిరుతపులి మృతికి కారణమయ్యారని.. నెల వ్యవధిలో అధికారుల నిర్లక్ష్యంగా వన్యప్రాణి ప్రాణాలు కోల్పోవడం ఇది రెండోసారి అని మండిపడుతున్నారు.
అడవి నుంచి వచ్చి జనావాసాల్లో బీభత్సం చేస్తున్న ఏనుగులను బంధించే ఆపరేషన్ నిమిత్తం అధికారులు అర్జునను తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ కొనసాగుతుండగా.. ఓ మదపుటేనుగు బీభత్సం చేసింది. దాన్ని భయపెట్టి తరిమేసేందుకు అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, ఆ కాల్పులు మిస్ ఫైర్ అయ్యి, అర్జున మృతికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఫారెస్టు అధికారుల తుపాకీ నుంచి దూసుకొచ్చిన తూటా గురితప్పి అర్జున కాలిలోకి దూసుకెళ్లిందని.. అది నొప్పితో విలవిల్లాడుతుండగా మదపుటేనుగు వచ్చి దాడి చేసిందని మావటి తెలిపాడు. అర్జున కదల్లేని స్థితిలో ఉండిపోవడంతో మదపుటేనుగు దాడి నుంచి తప్పించుకోలేకపోయిందని మావటి చెప్పినట్లు స్థానికంగా వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ వెటర్నరీ డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
‘బుల్లెట్ గాయంతో విలవిల్లాడుతూ కిందపడిపోయిన అర్జునకు చికిత్స అందించేందుకు ప్రయత్నించాం. మదపుటేనుగు ఘీంకరిస్తూ అటుగా పరుగెత్తుకొచ్చింది. దీంతో సిబ్బంది అందరూ దూరంగా పరుగెత్తారు. నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునపై మదపుటేనుగు దాడి చేసి, దంతాలతో పొట్టను చీల్చేసింది. దీంతో అర్జున రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచింది’ అని వెటర్నరీ డాక్టర్ తెలిపారు.
మైసూరు దసరా ఉత్సవాల పేరు చెప్పగానే ఏనుగు అంబారీ గుర్తుకొస్తుంది. ఈ ఉత్సవాల్లో అర్జున మొత్తం 22 సార్లు పాల్గొంది. భక్తులతో జేజేలు అందుకుంది. అయితే, మూడేళ్ల కిందట దీని వయస్సు 60 ఏళ్లు దాటడంతో ఈ సేవల నుంచి తప్పించారు. పులులు, మదపుటేనుగుల వేటలో అర్జున కీలక పాత్ర పోషించిందని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. అర్జున మరణవార్త విని భక్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళి అర్పించారు.





