
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబో తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవా హక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబో తోంది. దాదాపు రూ.40వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు రక్షణ కొనుగోళ్ల బోర్డు (డీపీబీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని వివరించాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం జరిగే రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో ఈ అంశం పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనికితోడు రూ.1.15 లక్షల కోట్లతో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవి మానాల కొనుగోలు కోసం భారత వైమానిక దళం తెచ్చిన ప్రతిపాదన పైనా డీఏసీలో చర్చ జరిగే వీలుందని తెలిపాయి.
ప్రతిపాదిత రెండో స్వదేశీ విమానవాహక నౌక (ఐఏసీ-2) బరువు 45వేల టన్నులు ఉండొచ్చు. దీన్ని కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించ నుంది. అది కూడా విక్రాంత్ తరహాలోనే ఉండొ చ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం లభిస్తే భారత వాయుసేన అమ్ముల పొదిలో ఈ జెట్ల సంఖ్య 180కి పెరగనుంది.





