
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర సాగతం పలికారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వారిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, పార్టీ విప్ చెవిరెడ్డి భాస్కర్, పలువురు వైసీపీ, బీజేపీ నేతలు ఉన్నారు.

అనంతరం రేణిగుంట నుంచి నేరుగా తిరుపతి సభకు ప్రధాని మోదీ వెళ్లారు. తిరుపతిలోని కార్బన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ప్రజా ధన్యవాద సభ’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సభ అనంతరం ఆయన తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 6. 15గంటల నుంచి రాత్రి 7.15గంటల వరకు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 8.15 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళతారు.






