
పాక్ లో 13ఏళ్ల హిందూ బాలికపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింధ్ ప్రావిన్స్‌లోని తాండో మొహమ్మద్ ఖాన్ జిల్లాలో నివసించే చిన్నారి సరుకుల కోసం సమీపంలోని కిరాణా షాపుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తుండగా.. దారిలో కాపు కాసిన ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయికి అడ్డుపడి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆమెను సమీపంలోగల ఓ మిల్లు వద్దకు లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
సరుకుల కోసమని షాపుకెళ్లిన కూతురు ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. ఓ మిల్లు వద్ద సృహలేని స్థితిలో బాలిక కనిపించడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు… బాలికపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారించారు. సృహలోకి వచ్చిన బాలిక జరిగిన విషయం చెప్పటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు.





