
నాగులచవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తొలి పూజ చేసి పుట్టలో పాలు పోశారు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు అన్నింటినీ ఆలయ సిబ్బంది రద్దు చేశారు. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి ఆలయానికి తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నాగుల చవితి పండగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పండుగ రోజు కృష్ణా జిల్లాలో ఉన్న ఆ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. నాగులచవితి రోజు మాత్రమే కాకుండా ఇతర రోజుల్లోనూ ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే నాగులచవితికి మాత్రం ఈ ఆలయం అత్యంత ప్రసిద్ది.





