News

టీటీడీ స్కంద పుష్కరిణిలో మత మార్పిడులపై ఆరుగురిపై కేసు నమోదు

442views

టీటీడీ పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ స్కంద పుష్కరిణిలో సోమవారం మత మార్పిడుల వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుష్కరిణిలో కొందరిని స్నానం చేయించి మత మార్పిడులకు పాల్పడుతుండగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై వేణుగోపాల స్వామి ఆలయ ఇన్స్‌పెక్టర్ గోపాలం సురేశ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాస్టర్ ఇమ్మానుయేల్, అతని కుటుంబ సభ్యులతో పాటు మరో ఇద్దరు పాస్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నబలూరు ఇమ్మానుయేల్, నబలూరు శాంతి, నబలూరు ప్రేమ్ కుమార్, నబలూరు గుణకుమార్, కోలా నాగరాజు, క్రిస్టఫర్ సుధీర్‌లపై కేసు నమోదు చేశారు.

కార్వేటి నగరం స్థానిక చర్చి నిర్వాహకులు సోమవారం కొంతమందికి బాప్టిజం ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై కార్వేటి నగరం పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నంబర్ 87/2023 మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

హిందువులకు పవిత్రమైన కార్తిక మాసం తొలి సోమవారం రోజున టీటీడీ అనుబంధ ఆలయమైన వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలోని పుష్కరిణిలో క్రైస్తవ మతానికి చెందిన కొందరు మత మార్పిడులకు పాల్పడడం దారుణమని పలువురు హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులను బలవంతంగా మతమార్పిడి చేసే కార్యక్రమాలు జరగడం అన్యాయమన్నారు. తాజా ఘటన హిందూ దేవుళ్లు, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.