ArticlesNews

నిష్కామకర్మయోగి, సంఘటనా దురంధరుడు దత్తోపంత్ ఠేంగ్డే

438views

( నవంబర్ 10 – దత్తోపంత్ ఠేంగ్డే జయంతి )

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను పరమ పూజ్యనీయ డా.కేశవ్ బలిరాం హెగ్డేవార్ ప్రారంభిస్తే, దానికి విస్తృతమైన తాత్విక భూమికను శ్రీ గురూజీ గోల్వాల్కర్ ఏర్పర్చితే కార్మిక, కర్షక, ఆర్థిక, సామాజిక రంగాల్లో బలమైన తాత్విక పునాదులు ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి చేశారు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే గారు. సామాజిక, రాజకీయ రంగాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలంకు బలమైన సైద్ధాంతిక పునాది ఏర్పాటు చేశారు. ఎటువంటి ఆవేశం, ఉద్వేగం లేకుండా ప్రశాంతమైన జీవనం గడుపుతూ మౌలికమైన సైద్ధాంతిక పునాదులు ఏర్పాటు చేయడంలో ఆయన అపరిమితమైన ప్రతిభను కనబర్చారు.

దత్తోపంత్ ఠేంగ్డే 1920 నవంబర్ 10న కార్తీక అమావాస్య, విక్రమ్ సంవత్ నాడు మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని అర్వీ గ్రామంలో జన్మించారు. ఆయన తన చిన్నతనం నుంచే విశేషమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. 15 ఏళ్ల వయసులో ‘వానర్ సేన’తో పాటు అర్వీలోని మున్సిపల హైస్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1936-38 వరకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యునిగా ఉన్నారు.

గురూజీ గోల్వాల్కర్‌తో విశేషంగా ప్రభావితమైన దత్తోపంత్ ఠేంగ్డే..డా.బిఆర్. అంబేద్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి విశిష్టమైన వ్యక్తులతో సన్నిహితంగా పని చేశారు. 1942 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్‌గా తన జీవితం మొత్తాన్ని సామాజిక సేవకే వినియోగించారు. కేరళ, బెంగాల్‌లలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలు విస్తరింపజేయడంలో ప్రధాన భూమిక పోషించారు. భారతీయ మజ్దూర్ సంఘంను దత్తోపంత్ ఠేంగ్డే 1955లో ప్రారంభించారు. ఆ తర్వాత 1979లో భారతీయ కిసాన్ సంఘ్, 1991లో స్వదేశీ జాగరణ్ మంచ్‌లను ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని రాజకీయ పక్షాలు పెట్టుబడిదారీ, సామ్యవాద ఆర్ధిక విధానాలను విదేశాల నుండి దిగుమతి చేసుకొని ప్రభావితమైన సమయంలో “మూడో మార్గం”గా స్వదేశీ ఆర్ధిక విధానాలను దేశం ముందుంచారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చిన `ఆత్మా నిర్భర్ భారత్’కు భూమిక దత్తోపంత్ ఠేంగ్డే ప్రవచించిన విధానాలే.

ఇక సమాజంలో వివక్షతకు, నిర్లక్షతకు గురవుతున్న ఎస్సి, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలవారిని జాతీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడం కోసం దత్తోపంత్ ఠేంగ్డే విశేషంగా కృషి చేశారు. ఆయన సారథ్యంలోనే సామజిక సమరసతా మంచ్, సర్వపంథ్ సమాదార్ మంచ్ వంటి వేదికలు ఆవిర్భవించాయి. నేడు దేశంలో అతిపెద్ద విద్యార్థి ఉద్యమంగా కొనసాగుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషద్‌కు ఆయన వ్యవస్థాపక సభ్యులు. అదే విధంగా అఖిల్ భారతీయ అధివక్త పరిషద్, అఖిల్ భారతీయ గ్రాహక పంచాయత్ వంటి వేదికల ఏర్పాటులో కీలక భూమిక వహించారు. విశిష్టమైన ఆలోచనాపరుల వేదికగా భారతీయ విచార కేంద్ర ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర వహించారు.

దత్తోపంత్ ఠేంగ్డే 1964 నుండి 1976 వరకు పుష్కరకాలం పాటు రాజ్యసభ సభ్యునిగా కీలక పాత్ర వహించారు. 1968-70లో రాజ్యసభ వైస్‌చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో లోక్ సంఘర్ష్ సమితి కార్యదర్శిగా ప్రజాస్వామ్య పునరుద్ధరణకోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర వహించారు. సామజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలపై సాధికారికతతో, అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన 100కు పైగా గ్రంధాలు రచించారు. వాటిల్లో “థర్డ్ వే”, “కార్యకర్త”, “ఆన్ రెవల్యూషన్”, “హిందూ ఆర్ధిక విధానం” గ్రంధాలు విశేషంగా ప్రాచూర్యం పొందాయి. భారతీయ తాత్విక చింతనకు, విదేశీ ఆలోచలకు గల మౌలికమైన తేడాల గురించి పలు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రసంగాలు చేశారు. సైద్ధాంతిక అంశాలలో రాజీలేని ధోరణి ఆవలంభించారు.

దత్తోపంత్ ఠేంగ్డే అనారోగ్యంతో 2004 అక్టోబర్ 14న మృతి చెందారు. అయినా ఆయన నెలకొల్పిన సంస్థలు అన్ని నేడు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థలుగా మన్ననలు పొందుతున్నాయి. ఏబీవీపీ, బీఎంఎస్, బికేఎస్, సామాజిక సమరసత మంచ్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు వివిధ సామాజిక రంగాల్లో మార్పునకు కృషి చేస్తున్నాయి.