
361views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్న వేళ.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొలిసారిగా ఇక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించింది. యోగి నేతృత్వంలో మంత్రి మండలి సభ్యులు గురువారం హనుమాన్ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామ్‌లల్లా ఆలయాన్ని దర్శించారు. అక్కడి నుంచి రామకథ మండపానికి చేరుకొని కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ సీతారామ అని రాసి ఉన్న కండువాలను ధరించి వారు ఇందులో పాల్గొన్నారు. అనంతరం శ్రీరాముడు, హనుమంతుడి చిత్రాలు ఉన్న బ్యానర్ ముందు నిలబడి యోగి విలేకర్లతో మాట్లాడారు. 25 ఎకరాల స్థలంలో ఆలయ మ్యూజియం, శ్రీరామ జన్మభూమి తీర్థ వికాస్ పరిషద్‌ను ఏర్పాటు చేయడానికి సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అయోధ్య పరిశోధన సంస్థను అంతర్జాతీయ రామాయణ వేద పరిశోధన సంస్థగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.





