News

బందీలైన మా వాళ్ల కోసం దీపాలు వెలిగించండి: భారత్‌ను కోరిన ఇజ్రాయెల్‌

468views

వెలుగుల పండగ దీపావళి సమీపిస్తున్న వేళ.. భారత్‌ కు ఇజ్రాయెల్‌ ఓ విన్నపం చేసింది. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల కోసం భారతీయులంతా దీపాలు వెలిగించాలని అభ్యర్థించింది. ఈ మేరకు భారత్‌కు ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌ ఎక్స్‌ వేదికగా ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో హమాస్‌తో తమ దేశం చేస్తున్న పోరును.. చెడుపై శ్రీరాముడు చేసిన యుద్ధంతో పోల్చారు.

‘‘గాజాలోని హమాస్‌ ఉగ్రవాదుల వద్ద 240 మంది ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో హోలోకాస్ట్‌ నుంచి బయటపడిన వారు.. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వారి విడుదల కోసం ఇజ్రాయెల్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో దీపావళి పండగ రానుంది. చెడును గెలిచి అయోధ్యకు తిరిగొచ్చిన ఆ శ్రీరాముడి విజయానికి గుర్తుగా దీపావళి పండగ చేసుకుంటున్నాం. ఎలాగైతే శ్రీరాముడి రాకను దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటున్నామో.. అలాగే బందీలుగా ఉన్న మా ప్రియమైన వాళ్లు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకుంటారనే ఆశతో మనం దీపాలు వెలిగిద్దాం. వారంతా క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిద్దాం’’ అని గిలాన్‌ భారతీయులను అభ్యర్థించారు.

ఈ విశ్వాసమనే దీపాన్ని ప్రతి ఒక్కరూ వెలిగించి.. ఆ ఫొటోలు షేర్‌ చేయాలని గిలాన్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన కూడా దీపాలు వెలిగిస్తున్న ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. దీనికి #DiyaofHope అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత హమాస్‌ అక్కడి నుంచి కొంతమందిని కిడ్నాప్‌ చేసి గాజాలో బంధించిన విషయం తెలిసిందే. గత నెల రోజులుగా వారు హమాస్‌ చెరలోనే ఉన్నారు. దీంతో బందీల విడుదల కోసం హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర పోరు సాగిస్తోంది. బందీలను విడిచిపెడితేనే కాల్పుల విరమణ చేపడుతామని ఇజ్రాయెల్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.