
విశాఖజిల్లాలోని సింహాచలం సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 12వ తేదీన దీపావళి వేడుక సంప్రదాయబద్ధంగా జరుగుతుందని దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు నరక చతుర్దశిని పురస్కరించుకుని నరకాసుర వధ ఘట్టం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మణవాళ మహామునుల తిరునక్షత్రం, 23 నుంచి 27వ తేదీ వరకు తిరుమంగైయాళ్వార్ తిరునక్ష్రతం పూజలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రోజుల్లో అప్పన్న స్వామి దేవాలయంలో జరగాల్సిన ఆర్జిత సేవలు సహస్రనామార్చన, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, గరుడ వాహన సేవ, నిత్య కల్యాణోత్సవాలు రద్దు చేసినట్లు తెలియజేశారు. 12న దీపావళి సందర్భంగా ఆరోజు సాయంత్రం 6గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని వివరించారు.
23న కార్తీక శుద్ధ ఏకాదశి
సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 23వ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి సన్నిధిలో కైశిక పురాణం విన్నపం జరుగుతుందని దేవస్థానం ఈవో పేర్కొన్నారు. ఆరోజు వైదిక కార్యక్రమాలు, గ్రామ తిరువీధి జరగనున్న నేపథ్యంలో రాత్రి 7గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని, ఈ సందర్భంగా ఆ రోజు రాత్రి ఆరాధన టికెట్లు రద్దు చేసినట్లు వివరించారు.
27న కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అప్పన్న ఆలయంలో వృశ్చిక దీపారాధన మహోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా ఆ రోజు రాత్రి 7 గంటల వరకే భక్తులకు దర్శనాలు కల్పించి ఆరాధన టికెట్లు రద్దు చేసినట్లు ఈవో వివరించారు.





