
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు సుదీర్ఘ సందేశాన్ని ఇచ్చింది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రపంచమంతా వేడుకగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలను పంచుకుంది. అయోధ్యలో నూతన రామ మందిర నిర్మాణం సంప్రదాయ నగర శైలిలో జరిగినట్లు ట్రస్ట్ తెలిపింది. తూర్పు నుంచి పడమరకు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయ నిర్మాణం జరిగినట్లు చెప్పింది. మొత్తం ఆలయ సముదాయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ట్రస్ట్ వివరాల ప్రకారం.. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగనుంది. మొదటి అంతస్తులో శ్రీరాముడు.. సీతా లక్ష్మణ హనుమంతుడి సహితంగా దర్శనమిస్తారు. ప్రాంగణంలో వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, శబరి, అహల్య ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత 50 రోజులలోపు కోటి మందికి పైగా భక్తులు అయోధ్యను సందర్శిస్తారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.





