News

యుద్ధనౌక సూరత్‌.. సిద్ధమైంది.!

325views

తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్‌ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ సూరత్‌ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్‌ (శిఖరావిష్కరణ) కార్యక్రమాన్ని సోమవారం సూరత్‌లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలనల తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కి.మీ. వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు.

ప్రాజెక్టు–15బీలో చివరి యుద్ధ నౌక..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్‌–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగావ్, ఇంఫాల్, సూరత్‌ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్‌ మర్ముగావ్, ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి.

తాజాగా చివరి నౌకగా ఐఎన్‌ఎస్‌ సూరత్‌ వార్‌ షిప్‌ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్‌కు సంబంధించి 2018 జూలైలో కీల్‌ నిర్మించగా.. 2022 మే 17న షిప్‌ తయారీ పనుల్ని బ్లాక్‌ కనస్ట్రక్షన్‌ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్‌లో ప్రధాన ఓడరేవు అయిన పోర్‌బందర్‌ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్‌ఎస్‌ సూరత్‌గా నామకరణం చేశారు.

ఈ 4 షిప్స్‌ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్‌ఎస్‌ సూరత్‌ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్‌ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్‌ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్‌లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్‌ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు.