
రాష్ట్రంలోని పలు దేవాలయాల మౌలిక వసతుల కల్పించేలా పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.నిన్న రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడారు. దాదాపు 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, 150 కోట్లతో శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయం తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవాలయాల అభివృద్ది పనులను ఇప్పటికే చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా సింహాచలం, ద్వారకా తిరుమల దేవాలయాల అభివృద్ది పనులను కూడా త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా పలు దేవాలయాల్లో ప్రసాదాలు తయారీకి ఉపయోగించే ప్రధాన పదార్థాల ధరలలో వ్యత్యాసాన్ని గమనించడం జరిగిందని, ఈ వ్యత్యాసాన్ని నియంత్రించేందుకు ప్రధాన పదార్థాల ధరలను నిర్ణయించేందుకు ఒక రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.





