News

సింహాద్రి అప్పన్న ఆలయంలోకి శునకం

272views

సింహాద్రి అప్పన్న ఆలయ ప్రాంగణంలోకి గురువారం ఉదయం ఓ శునకం ప్రవేశించడంతో తీవ్ర కలకలం రేగింది. ఉదయం ఏడు గంటల సమయంలో సర్వదర్శనం క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఒక వీధి కుక్క బేడా మండపం వరకు చేరుకుంది. అర్చకులు, సిబ్బంది గమనించి దానిని బయటకు తరిమేసి ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. ఇందుకోసం దర్శనాలు నిలిపి వేయటంతో భక్తులు రెండు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.

ఇరవై రోజుల కిందట కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని సమాచారం. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా సిబ్బంది అప్రమత్తం కాకపోవటంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాకారం చుట్టూ, అన్ని ద్వారాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయినప్పటికీ ఓ వీధి కుక్క ఉత్తర గోపురం, ప్రధాన ద్వారం దాటుకుని ఏకంగా ఆస్థాన మండపం వరకు చేరుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఉదయం వేళ సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.