ArticlesNews

జమ్మూ కాశ్మీర్ : భారత్‌లో ఇలా కలిసింది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్యభూమిక

406views

( అక్టోబర్ – 26 జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవం )

మహారాజా గులాబ్ సింగ్ వంశస్థుడైన మహారాజా హరిసింగ్ 1925 నుంచి కాశ్మీర్‌కు పాలకుడయ్యాడు. డోగ్రా జాతికి చెందిన ఈ రాజు హరి సింగ్ హిందువే అయినా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 నాటికి కాశ్మీర్ జనాభాలో 77% ముస్లింలు కాగా, 20% మాత్రమే హిందువులు. భారత, పాకిస్థాన్ దేశాలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన 1947 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలను అనుసరించి సంస్థానాధీశుల పాలన క్రింద ఉన్న పలు సంస్థానాలు వాటి అభీష్టం మేరకు స్వతంత్ర దేశాలుగా కొనసాగవచ్చు. లేక భారతదేశంలో కానీ, పాకిస్థాన్‌లో కానీ విలీనం కావచ్చు.

హైదరాబాద్, జునాగడ్, జమ్మూకాశ్మీర్‌లు మినహా మిగిలిన సంస్థానాలన్నీ 1947 ఆగష్టు 15 నాటికి విలీనం గురించి నిర్ణయం తీసుకున్నాయి. బేషరతుగా భారతదేశంలో విలీనమవుతూ ‘ఇంస్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్’ పత్రంపై ఆయా సంస్థానాధీశులు సంతకాలు చేశారు. హైదరాబాద్, జునాగడ్ సంస్థానాల నవాబులు పాకిస్థాన్‌లో కలవాలనుకున్నారు. కానీ ఆయా సంస్థానాల ప్రజల ఆకాంక్షలకు సర్దార్ పటేల్ చొరవ తోడవడంతో అవి రెండూ భారత్‌లోనే విలీనం కాక తప్పలేదు. జమ్మూకాశ్మీర్ రాజు హరిసింగ్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. భారత్, పాక్‌లతో ఒప్పందం చేసుకొని తన రాజ్యాన్ని ఏ దేశంలోనూ విలీనం చెయ్యకుండా స్వతంత్రంగా ఉంచుకోవాలని భావించారు.

జమ్మూకాశ్మీర్ జనాభాలో అధికులు ముస్లింలు అయిన కారణంగా కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆశలు పెంచుకుంది. 1947 అక్టోబరు 24న శ్రీనగర్ కి 50 కిలోమీటర్ల దూరంలోని మహూర పవర్ స్టేషన్ ను కొండ జాతి దండుగా పేర్కొనే పాకిస్తానీ దుండగులు డైనమేట్లతో పేల్చేశారు. కాశ్మీరు లోయను ఆక్రమించుకోవడానికి దూసుకొచ్చారు. నిజానికి వారందరూ సాధారణ దుస్తుల్లో ఉన్న పాకిస్తానీ సైనికులే. వారి చేతిలోని ఆయుధాలు పాక్ బలగాలవే. జమ్మూకాశ్మీర్ పోలీసు, మిలటరీ, ప్రభుత్వ అధికార యంత్రాంగాలలోని ముస్లిములు చాల మంది పాకిస్థాన్ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో కాశ్మీర్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

పాకిస్థానీ సైనికుల కాశ్మీర్‌లో సాగిస్తున్న దురాగాతాలను నిలువరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవిక్ సంఘ్ విశేషంగా కృషి చేసింది. అప్పటి కాశ్మీర్ సంఘ ప్రచారక్ శ్రీబలరాజ్ మధోక్ వ్యూహం మేరకు ఐదుగురు యువకులు మహమ్మదీయులుగా వేషం ధరించి మోటారు సైకిల్‌పై నగరమంతా తిరుగుతూ సమాచారం సేకరించి శ్రీమధోక్‌కు అందించారు. మంగళసేన్, హరీష్ భానోత్ అనే ఇద్దరు డాక్టరు, కాంపౌండర్‌గా మారి ఉచిత వైద్యం పేరుతో పాక్ సైనికులను ఆకర్షించి వారి వ్యూహాలను తెలుసుకొని మహారాజుకు చేరవేసేవారు. పాక్ సైన్యాలను నిలువరించడం కోసం 200 మంది మెరికల్లాంటి యువ స్వయం సేవకులు మహారాజా సైనికులతో కలిసి పోరాడారు. భారత సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తున్న పాక్ అల్లరి మూకలను ఎదుర్కొంటున్న తన సైనికులలో ఆత్మస్థైర్యం నింపేందుకు సరిహద్దుల్లో పర్యటిస్తున్న మహారాజా హరిసింగ్‌ను భిమ్బర్లోని డాక్ బంగ్లా వద్ద అపహరించి బలప్రయోగంతో ఆయన చేత విలీన పత్రాలపై సంతకం చేయించుకోవాలని పాకిస్థాన్ అధికారులు పథకం వేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన స్వయంసేవకులు మహారాజా హరిసింగ్‌ను ముందుగానే అప్రమత్తం చేశారు.

కాశ్మీర్‌లోని నౌశహరా గ్రామం మీదకి పాకిస్థాన్ సైనికులు, కాబూలీలు మిడతల దండులా దాడికి వచ్చినప్పుడు అమరనాథ్ శర్మ అనే కార్యకర్త సూచనల మేరకు ఆ గ్రామంలోని 25 మంది స్వయం సేవకులు గ్రామీణులందరినీ కూడగట్టి వారిసాయంతో ఇళ్లపైకెక్కి శత్రుమూకలపై కంకర రాళ్లతో దాడి చేశారు. కాశ్మీర్‌లో పాక్ తన దురాగాతాన్ని కొనసాగిస్తుండగా గురూజీ సూచనలతో కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ మహారాజా హరిసింగ్ ఇంస్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం చేశారు. దీంతో కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అయింది.

ఇక పాక్‌ను ఎదిరించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. అయితే కాశ్మీర్‌కు చేరుకోవాలంటే సైన్యం విమానాల్లో రావాల్సిందే. అలా రావాలంటే విమానాశ్రయాలు సిద్ధంగా ఉండాలి. కానీ ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో విమానాశ్రయాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో రంగంలోకి దిగిన వేలాది స్వయం సేవకులు ఖాకీ నిక్కర్లు వేసుకొని దేశం కోసం సర్వం సమర్పిస్తాం దానికి బదులుగా ఏమీ కోరుకోము అంటూ భోజనాన్ని సైతం తమ ఇళ్ల వద్ద నుంచే తెచ్చుకొని పగలు, రాత్రి శ్రమించి అనుకున్న సమయానికి శ్రీనగర్, పూంచ్, జమ్మూల్లోని మూడు విమానాశ్రయాలను సిద్ధం చేసి పాక్ సైనికులను తరిమికొట్టేందుకు భారత సైన్యానికి తోడ్పాటు అందించారు.

కాశ్మీర్ మహారాజా హరిసింగ్ జమ్మూకాశ్మీర్‌ను భారతదేశంలో చేర్చే పత్రంపై అక్టోబర్ 26న సంతకం చేశారు. భారత్‌లో జమ్మూకాశ్మీర్ విలీనం అయిందంటే దీని వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పోరాటం ఉంది. ఎందరో స్వయంసేవకుల బలిదానాలున్నాయి. కృషి ఉంది. తపస్సు ఉంది. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు జమ్మూకాశ్మీర్ సమాజంలో సానుకూల మార్పునకు దారి తీసింది. ఉపాధి కల్పన, ఆర్థిక మందగమనంపై ఆశలు చిగురించాయి. తీవ్రవాద సంబంధిత హింసాకాండ అనూహ్యంగా తగ్గుముఖం పట్టింది. ఆర్టికల్ 370 రద్దుతో అక్టోబర్ 26ను బ్లాక్ డేగా కాకుండా విలీన దినోత్సవంగా జమ్మూకాశ్మీర్ ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారు.