
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి.. శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో మాడవీధుల్లో విహరించారు. అంతకుముందు ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం జరిగింది. విశేషసంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీభూవరాహస్వామి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
జీయర్లు, అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు, శ్రీ చక్రత్తాళ్వార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. మంగళవాద్యాలు, పండితుల వేదఘోష మధ్య శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సుదర్శన చక్రస్నానం చేయించారు. ఈ క్రతువుతో ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని ప్రతీతి. కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిశోర్ పాల్గొన్నారు.




