
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు సోమవారం దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు అభయమిచ్చింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం కృష్ణా నదిలో గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
దుర్గ గుడి ఈవో కె.ఎస్.రామారావు, వేదపండితులు కలిసి మంగళవాద్యాలు, కోలాటాల మధ్య దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా దుర్గా ఘాట్‌కు తీసుకొచ్చారు. ఆపై విద్యుత్తు కాంతులతో అలంకరించిన హంస వాహనంపైకి తీసుకెళ్లి, కృష్ణా నదిలో మూడుసార్లు జలవిహారం చేయించారు. అనంతరం ఉత్సవమూర్తులను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి.. పూజలు నిర్వహించారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో దుర్గాఘాట్, ప్రకాశం బ్యారేజీ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. మంగళవారం కూడా అమ్మవారిని రాజరాజేశ్వరి దేవీ అలంకారంలోనే ఉంచగా.. లక్ష మందికిపైగా భవానీ దీక్షాధారులు దర్శించుకున్నారు.




