ఉక్రెయిన్-ఇజ్రాయెల్ తరహా యుద్ధాలు భారత్‌లో జరగవు, అదే హిందూమతం గొప్పదనం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ పూజనీయ డా. మోహన్ భగవత్ జీ స్పందించారు. భారత్‌లో ఎప్పుడూ ఇలాంటి అంతర్గత యుద్ధాలు జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. హిందూమతం అన్ని వర్గాల వాళ్లను ఆదరిస్తుందని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 350వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మోహన్ భగవత్ జీ. ఈ సందర్భంగా ఇజ్రాయేల్ – పాలస్తీనా యుద్ధం గురించి ప్రస్తావించారు. ఆ అంశాన్ని హిందూమతంతో ముడిపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూయిజం అన్ని వర్గాల విశ్వాసాలకు గౌరవిస్తుందని అన్నారు. అంతర్గత కొట్లాటలు లేవని, అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు.
“ఈ భారత దేశంలో అన్ని మతాలను, వర్గాలను గౌరవించే మతం ఏదైనా ఉందంటే అది హిందూమతం మాత్రమే. ఇది హిందూ దేశం. అలా అని మిగతా మతాలను ద్వేషించాలని కాదు. ముస్లింలకు రక్షణ కల్పించాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందువులు మాత్రమే ఇది చేయగలరు. భారత్‌లో మాత్రమే ఇది సాధ్యం. మరే దేశంలోనూ ఇంత భద్రత కనిపించదు. చాలా దేశాల్లో అంతర్గత కలహాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం జరుగుతోంది. మన దేశంలో మాత్రం ఇలాంటి యుద్ధాలు ఎప్పుడూ జరగలేదు. శివాజీ మహారాజ్ పరిపాలనా సమయంలో ఇలాంటి ఆక్రమణలు జరిగాయి. కానీ ఇలా రెండు మతాల మధ్య యుద్ధాలు జరగలేదు. అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలి”, అని మోహన్ భగవత్ జీ స్పష్టం చేశారు.





