
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. భక్తులు ముందుగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కొండపై ఉన్న సందర్శనీయ ప్రాంతాలకు కచ్చితంగా వెళుతుంటారు. ఇలా పాప వినాశనం, కపిలతీర్థం వెళ్లొస్తుంటారు. అయితే భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేలా.. ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా మ్యూజియంను సిద్దం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియంను తీర్చి దిద్దుతున్నారు. భక్తుల్ని అబ్బురపరిచేలా సరికొత్తగా రూపొందిస్తున్నారు. డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతోందని మ్యూజియం అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. టీసీఎస్ సంస్థ రూ.125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ రూ.20 కోట్లు కలిపి మొత్తం రూ.145 కోట్ల విరాళంతో నూతన హంగులతో మ్యూజియం రూపుదిద్దుకుంటోందన్నారు కృష్ణారెడ్డి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని వినియోగించి త్రీడీ, 7 డీ హంగులతో టీసీఎస్ 14, మ్యాప్ సిస్టమ్స్ 5 కలిపి మొత్తం 19 గ్యాలరీలతో ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.
అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన సేవలు, స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉన్నాయని, వీటిని బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ వారు అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. మిగతా గ్యాలరీలను టీసీఎస్ సంస్థవారు ఆధునీకరిస్తున్నారని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లో శ్రీ వేంకటేశ్వరుడు, రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, దారు విగ్రహాలు, అన్నమయ్య రాగి రేకులు, పురాతన నాణేల గ్యాలరీలు ఉన్నాయన్నారు.
మొదటి ఫ్లోర్ లో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, భక్తాగ్రేసరులు- వారి సేవలు, యుద్ధ పరికరాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి గ్యాలరీలు వంటి అనేక అద్భుతాలు కౌలువుతీరి భక్తులను అబ్బురపరిచేలా ఉన్నాయని చెప్పారు. రెండవ ఫ్లోర్లో విరాట్ పురుషుడు బ్రహ్మ మహేశ్వరులు, ఋగ్వేదం, యజుర్వేదం గ్యాలరీలు ఉన్నాయన్నారు. మూడో ఫ్లోర్లో బ్రహ్మాండ గ్యాలరీ కొలువై ఉందని, మ్యూజియం పైభాగంలో 17 పెద్ద గోపురాలు ఉన్నాయని తెలిపారు.





