
‘గగన్‌యాన్ ’ ప్రయోగం దిశగా కీలక ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ-డీ1)’ పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్.. పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఓ ట్వీట్ చేసింది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘గగన్‌యాన్’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందని పేర్కొన్నారు.
గగన్‌యాన్.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం
‘భారత మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష మిషన్ ‘గగన్‌యాన్’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అంటూ టీవీ-డీ1 పరీక్ష విజయవంతంపై ప్రధాని మోదీ స్పందించారు. తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకే చేపట్టేందుకు ఇస్రో యత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం శాస్త్రవేత్తలు ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించి.. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.





