
శ్రీవారి సేవకులు తోటి భక్తులకు సేవలందిస్తూ నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారని, వీరిని సనాతన హిందూ ధర్మ జ్యోతులుగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. తిరుమల శ్రీవారి సేవా సదన్ -2లో శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఛైర్మన్ మాట్లాడుతూ టీటీడీ 23 సంవత్సరాల క్రితం కేవలం 200 మంది సేవకులతో శ్రీవారి సేవను ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం రోజుకు 2000 మందికి తక్కువ కాకుండా సేవలందిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది శ్రీవారి సేవకులు తిరుమల, తిరుపతిలో భక్తులకు సేవలందించారని వెల్లడించారు. శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ స్వామివారి కీర్తిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సేవకులు ధన్యులన్నారు. నిస్వార్థ సేవలను కొనసాగించాలని, స్వచ్ఛంద సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
అనంతరం గరుడసేవ కోసం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా శ్రీవారి సేవకులకు ఆలయ విధులను టీటీడీ ఛైర్మన్ చేతులమీదుగా కేటాయించారు.





