
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక విమానాలను నడుపుతున్నది. భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం నేడు దేశానికి చేరుకోనుందని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో 20 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని తెలిపారు.
ఈ నేపథ్యంలో యుద్ధ భూమిలో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.





